35యేళ్ల తర్వాత కళ్యాణ్ చక్రవర్తి వస్తున్నాడు

- December 06, 2025 , by Maagulf
35యేళ్ల తర్వాత కళ్యాణ్ చక్రవర్తి వస్తున్నాడు

35యేళ్ల క్రితం ఓ నటుడు కనిపించక పోవడం అనేది అప్పట్లో పెద్దగా తెలియదు. కానీ అన్నేళ్ల తర్వాత అతని గురించి మాట్లాడుకోవడం, లేదా ఆరాలు తీయడం మాత్రం అంటే అదేదో విశేషం ఉంది అని కదా. పైగా అన్నేళ్ల క్రితం అంటే ఓ చిన్న నటుడు కాదు, భారీ సినిమాల్లో నటించాడు. హీరోగా రాణించాడు. అంతా బావుంది అనే టైమ్ లో అనుకోని ప్రమాదంతో అతని జీవితం తలకిందులు అయిపోయింది. ఇంతకీ ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా..? కళ్యాణ చక్రవర్తి. అంటే ఎవరు అనిపిస్తుంది కదా.. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు తనయుడు. నందమూరి కుటుంబం నుంచే వచ్చిన వారసుడు ఆయన. రూపంలో బావుంటాడు. ఆకట్టుకునే చిత్రాలు సైతం మెప్పించాడు. 1986 లో మొదలైన కెరీర్ కేవలం మూడేళ్ల వరకే సాగింది. 1989 కే ముగిసిపోయింది. అయితేనేం ఆ మూడేళ్ల లోనే చాలా సినిమాల్లో ఆకట్టుకున్నాడు. తలంబ్రాలు, మేనమామ, అక్షింతలు, ఇంటి దొంగ వంటి చిత్రాల్లో మెప్పించాడు. చిరంజీవి హీరోగా దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన వందవ సినిమా లంకేశ్వరుడులో కీలక పాత్రలో నటించాడు. ఆ తర్వాత అతను మరే సినిమాలోనూ కనిపించలేదు. 2003లో కమిర్ దాస్ చిత్రంలో శ్రీరాముడుగా కనిపించిన విషయం కూడా చాలా కొద్దిమందికే తెలుసు. మొత్తంగా ఇన్నేళ్ల తర్వాత అతను మరో తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇన్నేళ్లుగా చెన్నైలోనే ఉండిపోయిన ఆయన ఇన్నేళ్లకు తెరపై కనిపించడం మాత్రం విశేషం. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రంలో రాజిరెడ్డి పాత్రతో ఆయన తిరిగి కెరీర్ మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించాడు. 35యేళ్ల తర్వాత అతను రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అనౌన్స్ చేశారు. ఆయన రాజిరెడ్డి అనే పాత్రతో తిరిగి పరిచయం అవుతున్నాడు. మరి సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడో కానీ.. ఇన్నేళ్ల తర్వాత అతను తిరిగి నటనకు రావడం మాత్రం సంతోషం. ఇలాంటి మరిన్ని పాత్రలతో మళ్లీ తెలుగులో బిజీ అవుతాడని కోరుకుంటూ.. ఆల్ ద బెస్ట్ టూ కళ్యాణ్ చక్రవర్తి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com