సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- December 19, 2025
సౌదీ అరేబియా: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ అవమానం ఎదురైంది. పవిత్రమైన ఉమ్రా, పర్యాటక వీసాలను అడ్డం పెట్టుకుని విదేశాల్లో ‘భిక్షాటన’ను ఒక వృత్తిగా మార్చుకున్న వేలాది మంది పాక్ పౌరులపై సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు కొరడా ఝుళిపించాయి. నేరాలు, యాచనకు పాల్పడుతున్న దాదాపు 56,000 మంది పాకిస్థానీయులను సౌదీ అరేబియా తాజాగా బహిష్కరించింది. పాక్ జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్కడి పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడి అయ్యాయి.
2025లో అక్రమ వలసలు, భిక్షాటన నిర్మూలనలో భాగంగా మొత్తం 66,154 మంది పాక్ పౌరులను వివిధ దేశాలు వెనక్కి పంపించాయి. 2023లో ఈ సంఖ్య 35,000గా ఉండగా.. కేవలం ఏడాది కాలంలోనే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వీరిలో 51,000 మంది కేవలం వర్క్, టూరిస్ట్, ఉమ్రా వీసాల పేరుతో వెళ్లి అక్కడ యాచనకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సౌదీ అరేబియానే 24,000 మందిని బహిష్కరించగా.. దుబాయ్ 6,000 మందిని, అజర్బైజాన్ 2,500 మందిని వెనక్కి పంపింది. కేవలం గల్ఫ్ దేశాలే కాకుండా కాంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాలకు పర్యాటక వీసాలపై వెళ్తున్న పాకిస్థానీయులు కూడా అదృశ్యం అవుతున్నారని.. తిరిగి మాతృదేశానికి రావడం లేదని ఎఫ్ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖ్తార్ ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో (మక్కా, మదీనా వంటివి) అరెస్టవుతున్న భిక్షగాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీయులే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరు కేవలం భిక్షాటనకే పరిమితం కాకుండా యాత్రికుల జేబులు కత్తిరించడం వంటి నేర కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు వివరిస్తున్నారు. ఈ ముఠాల కారణంగా పాకిస్థాన్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మంటగలిసిపోతోందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







