భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి

- December 19, 2025 , by Maagulf
భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి

న్యూ ఢిల్లీ: భారత ఏవియేషన్ రంగంలో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, అదానీ గ్రూప్ తమ విమానాశ్రయ వ్యాపారంలో భారీ పెట్టుబడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ వెల్లడించారు.

ఈ నెల 25న ప్రారంభం కానున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, రూ.19,650 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. దీనిలో అదానీ గ్రూప్ 74 శాతం వాటా కలిగి ఉంది. మొదటి దశలో ఈ విమానాశ్రయం సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో సామర్థ్యాన్ని 9 కోట్ల మందికి పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇది ముంబై విమానాశ్రయంపై ఉన్న ప్రస్తుత భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

జీత్ అదానీ ప్రకారం, భారత ఏవియేషన్ రంగం వచ్చే 10-15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15-16 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళికల్లో అదానీ గ్రూప్ దూకుడుగా పాల్గొని, 11 విమానాశ్రయాల కోసం బిడ్ చేసేందుకు సిద్దమని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ముంబై, నవీ ముంబైతో పాటు అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహతి, జైపూర్ వంటి ఇతర 6 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం ప్రయాణికులలో దాదాపు 23 శాతం వారి ప్రయాణాలు అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ ద్వారా జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com