ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి

- December 24, 2025 , by Maagulf
ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి

ఏలూరు: ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర ప్రముఖమైనదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు.  స్థానిక ఆశ్రమ్ ఆసుపత్రిలో సోమవారం ఏపియుడబ్ల్యూజె, ఆశ్రమ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో  ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏలూరు, దెందులూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి),చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆశ్రమ్ ఆసుపత్రి డైరెక్టర్ గోకరాజు రతీదేవి, వివిధ జర్నలిస్ట్  సంఘాల ప్రతినిధులు,ప్రభృతులు పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభమని,సమాజంలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని సరిచేసేందుకు కృషి చేసే జర్నలిస్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ప్రత్యేక  స్థానం ఉందన్నారు.  జర్నలిస్టుల జీవనశైలిలో వచ్చే ఆరోగ్య సమస్యపై వారి ఆరోగ్య పరిరక్షణకు ఆశ్రమ్ ఆసుపత్రి వారు హెల్త్ కార్డులు జారీ చేయడం అభినందనీయమని, ఆశ్రమ్ ఆసుపత్రి డైరెక్టర్ గోకరాజు రతీదేవి, గోకరాజు గంగరాజుల సేవా భావాన్ని మంత్రి కొనియాడారు.గత ప్రభుత్వం జర్నలిస్టుల పట్టించుకోకుండా అంతకు ముందు 21 వేలకు పైగా ఉన్న అక్రిడిటేషన్లను 12 వేలకు కుదించిందన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ అక్రిడిటేషన్లను నెలలోగా అందిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందిస్తామన్నారు.    

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే జర్నలిస్టులకు ఆశ్రమ్ ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ కార్డులు అందించడం అభినందించతగిన విషయమన్నారు. 

ఆసుపత్రి సీఈఓ కె.హనుమంతరావు మాట్లాడుతూ ఆశ్రమ్ ఆసుపత్రి ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య పరీక్షలు  నిర్వహించి,తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నామన్నారు.40 కోట్ల రూపాయలతో కేన్సర్ చికిత్సకు అత్యంత ఆధునిక వైద్య పరికరాలతో ఏర్పాటుచేశామన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర సమయంలో విజయవాడ కు వెళ్లనవసరం లేకుండా  200 కోట్ల రూపాయలతో 3 లక్షల చదరపు అడుగులలో  సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  
             
జర్నలిస్ట్  సంఘ నాయకులూ కె.మాణిక్యరావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ఆశ్రమ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రాధాన్యతను ఇచ్చి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలలోని జర్నలిస్టులకు  హెల్త్ కార్డులు జారీ చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. 
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథికి ఆశ్రమ్ ఆసుపత్రి వర్గాలు దుశ్శాలువా, మెమెంటోతో సత్కరించారు. 

కార్యక్రమంలో ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి,ప్రముఖులు రెడ్డి  తిరుపతిరావు, పూజారి నిరంజన్, జర్నలిస్టుల సంఘాల నాయకులూ,  ప్రతినిధులు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com