భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్‌..

- December 24, 2025 , by Maagulf
భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్‌..

న్యూ ఢిల్లీ: భారత దేశంలో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అల్‌ హింద్‌ ఎయిర్‌, ఫ్లై ఎక్స్‌ప్రెస్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల వందలాది విమానాలను రద్దు చేసిన ఇండిగో సంక్షోభానికి దారితీసిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఎయిర్‌లైన్స్‌ రంగంలో 2 కొత్త విమానయాన సంస్థలకు అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే అనుమతులు పొందిన మూడో విమానయాన సంస్థ శంఖ్‌ ఎయిర్‌.. 2026లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంక్షోభం తర్వాత విమానయాన రంగంలో ద్వంద్వాధిపత్యం అంతం చేయాలనే లక్ష్యంగా, పోటీని పెంచడానికి ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడవుతోంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విమానయాన మంత్రిత్వ శాఖ గత వారం రోజులుగా మూడు ఆశావహ విమానయాన సంస్థల బృందాలతో చర్చలు జరిపిందని అన్నారు.

దేశీయ విమానయాన రంగంలో ఇండిగో, టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గ్రూప్ అనే రెండు ప్రధాన సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే దాదాపు 90 శాతం ప్రయాణీకుల రద్దీని కలిగి ఉన్నాయి. ఇండిగోలో ఇటీవలి పెద్ద ఎత్తున జాప్యాలు, రద్దులు ఒకే విమానయాన సంస్థపై ఒత్తిడిని పెంచాయి. ఈ క్రమంలో గత వారం రోజులుగా కొత్త విమానయాన సంస్థలు – శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ – బృందాలను కలవడం సంతోషంగా ఉందని రామ్మోహన్‌ నాయుడు ‘X’లో పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశించేవారిని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వెల్లడించారు. 

కాగా, అల్ హింద్ ఎయిర్..కేరళకు చెందిన అల్హింద్ గ్రూప్‌లో భాగం. ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు హైదరాబాద్‌కు చెందిన కొరియర్, కార్గో సర్వీసెస్ కంపెనీ మద్దతు ఇస్తుంది. శంఖ్ ఎయిర్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, వారణాసి, ఆగ్రా, గోరఖ్‌పూర్ వంటి కీలక నగరాలను అనుసంధానించడంపై దృష్టి సారించి ప్రాంతీయ, మెట్రో మార్గాలను నడిపే యోచనలో ఉంది. ఇక, మోదీ ప్రభుత్వంలో విధానపరమైన చర్యలు.. మెట్రో, ప్రాంతీయ మార్గాల్లో సామర్థ్యం, పోటీని విస్తరించడంపై దృష్టి సారించాయని మంత్రి తెలిపారు. ఇక ఉడాన్‌ పథకంలో భాగంగా స్టార్ ఎయిర్, ఇండియావన్ ఎయిర్, ఫ్లై91 వంటి చిన్న క్యారియర్‌లు తక్కువ సేవలందిస్తున్న నగరాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి వీలు కల్పించాయని చెప్పారు. 

కాగా, ఈ మూడు కొత్త ఎయిర్‌లైన్స్‌.. అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. కానీ వాణిజ్య విమానాలను నడపడానికి అనుమతి లేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (AOC) పొందడం కీలకం. దీనికి విమానయాన సంస్థలు ఆర్థిక సామర్థ్యాన్ని ప్రదర్శించడం, విమానాలను కొనుగోలు చేయడం, శిక్షణ పొందిన సిబ్బందిని నియమించడం, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, నియంత్రణ రుజువు చేసే విమానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com