2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్

- December 24, 2025 , by Maagulf
2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తూ విపక్షాలకు సవాల్ విసిరారు. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల (2/3) మెజార్టీతో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వైపు ప్రజలను మళ్లీ తిప్పుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా విజయం తమదేనని రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు. ఒకవేళ 2029 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా 119 సీట్లే ఉంటే, అందులో 80 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగి అసెంబ్లీ సీట్ల సంఖ్య 150కి పెరిగితే, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100 మార్కును దాటుతుందని స్పష్టం చేశారు. ఈ అంచనాలు కేవలం ఊహలు కావని, గ్రౌండ్ లెవల్‌లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణే దీనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. “చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా బీఆర్ఎస్ నాయకులంతా ఇది రాసి పెట్టుకోండి” అని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రానివ్వనని ఆయన శపథం చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఆయన వ్యక్తం చేసిన ఈ బలమైన నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, ప్రత్యర్థి పార్టీల నుండి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com