'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు

- December 24, 2025 , by Maagulf
\'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ\' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు

న్యూ ఢిల్లీ: భారతదేశం గర్వించదగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్ పేయి జీవితాన్ని, సిద్ధాంతాలను, విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసే అవకాశం రావడం అటల్ జీ అందించిన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు...అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.భారత రత్న, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం ఏర్పాటు చేసిన 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ'కి అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. వాజ్‌పేయి ఆశయాలను, స్మతులను భావితరాలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సొసైటీకి ఇకపై వెంకయ్య నాయుడు నాయకత్వం వహించనున్నారు. 

ఈరోజు న్యూఢిల్లీలోని 1,త్యాగరాజ మార్గ్ లో ఉన్న వెంకయ్య నాయుడు అధికార నివాసానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రధాన కార్యాలయ ఇంఛార్జ్ అరుణ్ సింగ్, బీజేపీ కార్యాలయ కార్యదర్శి మహేంద్ర పాండే, అటల్ స్మృతిన్యాస్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు మరియు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ట్రస్ట్ అధ్యక్షులు రాం బహదూర్ రాయ్ తదితరులు విచ్చేశారు.నూతన అధ్యక్షులు  వెంకయ్య నాయుడు గారితో కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు వాజ్‌పేయి గారిని స్మరించుకుని ఆయన పట్ల తన గౌరవభావాన్ని పునరుద్ఘాటించారు. 

అటల్ జీ శతజయంతి సందర్భంలో వారు దేశానికి అందించిన సేవలను భారతీయులంతా స్మరించుకుంటున్నారన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు, వ్యక్తిగతంగా తన జీవితానికి అటల్ జీ మార్గదర్శకులని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాల పట్ల వారికున్న నిబద్ధత, ఉదార స్వభావం, మంత్రముగ్ధుల్ని చేసే వాగ్ధాటి, రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం, నైతిక పాలనకు ఇచ్చిన ప్రాధాన్యత, మహోన్నతమైన వ్యక్తిత్వం వంటి లక్షణాలు వారిని ఉన్నతంగా నిలబెట్టాయని పేర్కొన్నారు. అటల్ జీ నాయకత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసే అవకాశం లభించిందన్న ఆయన, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో... పితృవాత్సల్యంతో శ్రీ అటల్ జీ చేసిన దిశానిర్దేశం మహోన్నతమైనదని గుర్తు చేసుకున్నారు. 

అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షులుగా వారి నిజాయితీ, జాతీయవాదం, దార్శనికతతో కూడిన స్ఫూర్తిదాయక అంశాలను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్బంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రత్యేకించిన వారి సున్నితమైన కవితాత్మక సందేశాలు వివక్షత, విద్వేషాలకు తావులేని భవిష్యత్ కు బాటలు వేస్తాయని తెలిపారు. ముఖ్యంగా యువతరం వాజ్ పేయి జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలన్న ఆయన...అటల్ జీ పాటించిన విలువలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

దిల్లీలోని రాజ్‌ఘాట్ సమీపంలో వాజ్‌పేయి గారి స్మారక చిహ్నమైన 'సదైవ్ అటల్' నిర్వహణ బాధ్యతలను అటల్ స్మృతి న్యాస్ సొసైటీ నిర్వహిస్తుంది. మహోన్నత నాయకుడైన శ్రీ వాజ్‌పేయి గారికి ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా ప్రముఖ వ్యక్తులతో కూడిన ఈ సొసైటీ చొరవతో స్మృతి న్యాస్ నిర్మాణం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com