అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్

- January 09, 2026 , by Maagulf
అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్

అజ్మాన్: యూఏఈలో నివసిస్తున్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఆన్లైన్లో వినియోగించినందుకు రెండు మసాజ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టింది.

లైసెన్స్ పొందిన ఇన్ఫ్లూయెన్సర్ మరియు బ్లాగర్ అయిన ఆమెకు 1 లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తనకు తెలియకుండానే రెండు మసాజ్ సెంటర్లు ఆమె ఫోటోలను తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసి, అసభ్యమైన మరియు అవమానకరమైన వ్యాఖ్యలతో ప్రచారం చేయడం చూసి ఆమె షాక్కు గురయ్యారు.

ఈ ఘటన పై చట్టపరమైన చర్యల కోసం ఆ భారతీయ ప్రవాస మహిళ పలువురు న్యాయ సంస్థలను సంప్రదించగా, అధిక ఫీజులు పెద్ద అడ్డంకిగా మారాయి.
అయితే, ఈ డిజిటల్ వేధింపులు మరియు పరువు నష్టం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ సలామ్ పప్పినిస్సెరి ఎటువంటి ఫీజులు తీసుకోకుండా ఈ కేసును స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“యూఏఈలో ఒంటరిగా నివసించే మహిళలు సోషల్ మీడియాలో లక్ష్యంగా మారినప్పుడు ప్రతికూల పరిస్థితుల భయంతో చాలా సందర్భాల్లో చర్యలు తీసుకోరు. భయంతో వెనక్కి తగ్గకుండా, మహిళలు అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు రావాలి. అవసరమైనప్పుడు చట్టపరమైన సహాయం పొందేందుకు మహిళలు ముందుకు రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ కేసును స్వీకరించాను” అని తెలిపారు.
ఈ ఘటనపై అజ్మాన్ పోలీస్ స్టేషన్లో అజ్మాన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. విచారణ అనంతరం పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేయగా, ప్రస్తుతం కేసు న్యాయ ప్రక్రియలో ఉంది.

యూఏఈలో సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 (2021), సవరణ చట్టం నంబర్ 5 (2024) ప్రకారం, ఆన్లైన్లో అవమానాలు లేదా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు జైలు శిక్షతో పాటు దిర్హామ్ 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.ప్రజాప్రతినిధులు లేదా విస్తృతంగా ఫాలో అయ్యే ఖాతాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రచారం చేయబడితే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.

గత ఏడాది చివర్లో యూఏఈ అధికారులు సోషల్ మీడియా వినియోగదారులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు.రాత, ఆడియో, వీడియో లేదా లైవ్ స్ట్రీమ్ల రూపంలో అయినా, ఎలాంటి ప్రతికూల, దూషణాత్మక లేదా అపకీర్తికర కంటెంట్ను పోస్ట్ చేయవద్దని, అలాగే అలాంటి కంటెంట్కు స్పందించవద్దని స్పష్టంగా సూచించారు.

--(బాజీ షేక్, యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com