ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి

- January 23, 2026 , by Maagulf
ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి

హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలోని దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు (NTR), అక్కినేని నాగేశ్వరరావు (ANR), శోభన్ బాబు వ్యక్తిత్వాలు హుందాతనం, సహృదయం, మర్యాదతో కూడినవని, నేటి తరానికి అవి ఆదర్శంగా నిలుస్తాయని ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు.

శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో, ప్రముఖ గాయకుడు ఫణి నిర్వహణలో “స్వర నివాళి” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు నటించిన చిత్రాలలోని సూపర్ హిట్ పాటలను ఫణి, శాస్త్రి రవికుమార్, హృషికేశ్, గంటి రామకృష్ణ, శైలజ, లలిత, రాధిక తదితర గాయకులు మధురంగా ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, ముగ్గురు మహానటులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్‌టీఆర్ సహృదయత, ఏఎన్‌ఆర్ సరదాతనం, శోభన్ బాబు హుందాతనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవని అన్నారు. వారి వ్యక్తిత్వాలు కేవలం నటనలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వంశీ రామరాజు మాట్లాడుతూ, ఎన్‌టీఆర్‌తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఏఎన్‌ఆర్ వంశీ సంస్థకు మేనమామ అని, శోభన్ బాబు తమ వంశీ సాంస్కృతిక సంస్థను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆ ముగ్గురు మహానటులకు సంగీత స్వరూపంలో ఘన నివాళి అర్పించామని అన్నారు.

తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని స్మరింపజేసిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com