పెళ్లి చూపులు సినిమా రివ్యూ
- July 29, 2016
విజయ్ దేవరకొండ.. రీతూ వర్మ.. నందు.. అభయ్ కురువిల్లా.. ప్రియదర్శన్ తదితరులు సంగీతం: వివేక్ సాగర్ ఛాయాగ్రహణం: నగేష్ బెగెల్లా కూర్పు: రవితేజ నిర్మాతలు: రాజ్ కందుకూరి, యష్ రంగినేని సమర్పణ: డి.సురేష్‌బాబు రచన-దర్శకత్వం: తరుణ్ భాస్కర్ సంస్థ: ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్ విడుదల: 29-07-2016
ఈ మధ్య పెద్ద, చిన్నా అనే తేడా లేదు. సినిమాలన్నీ హంగు, ఆర్భాటాలపైనే దృష్టి పెట్టాయి. ప్రేక్షకులకు ఏం కావాలి? మనం ఏం ఇస్తున్నాం? అనే విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టేశాయి. దానికి తగ్గట్టు ప్రేక్షకులు కూడా తిరస్కరిస్తూ వస్తున్నారు. నిజానికి ప్రేక్షకులు కూడా మరీ ఎక్కువేం కోరుకోరు. చక్కటి కథ, సున్నితమైన వినోదం, సమపాళ్లలో భావోద్వేగాల్ని రంగరిస్తే చాలు... అనుకొంటారు. అలాంటి చిత్రం చిన్నదైనా సరే... నీరాజనాలు పడతారు. సరిగ్గా ఇవే లక్షణాలతో వచ్చిన సినిమా 'పెళ్లి చూపులు'. 'ఎవడే సుబ్రమణ్యం'తో ఆకట్టుకొన్న విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో కథానాయకుడిగా ప్రమోషన్ అందుకొన్నాడు. కొత్త దర్శకుడు, కొత్త కథానాయిక, కొత్త నటీ నట బృందంతో చేసిన ఈ 'కొత్త' ప్రయత్నం ఎంత వరకూ ఫలించింది? పెళ్లి చూపుల కథేంటి? తెలుసుకొందాం రండి.
కథేంటంటే..?: ఇంజినీరింగ్‌ని అనేకసార్లు పల్టీలు కొట్టి పూర్తి చేసిన కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). తండ్రి ఎప్పుడూ 'ఏదో ఓ ఉద్యోగం చూసుకొని జీవితంలో స్థిరపడ'మని పోరు పెడుతున్నా చెవికెక్కించుకోడు. కానీ ప్రశాంత్‌కి వంటలంటే ఇష్టం. ఎప్పటికైనా చెఫ్‌గా తనని తాను చూసుకోవాలని కలలు కంటుంటాడు. ఇదే క్రమంలో ప్రశాంత్ ఓసారి పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ చిత్ర (రీతూ వర్మ)ని కలుస్తాడు. చిత్రకి అప్పటికే ఓ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ తనతో బ్రేకప్ అవుతుంది. అటు ప్రశాంత్‌కీ, ఇటు చిత్రకీ ఈ పెళ్లిచూపుల తతంగం ఇష్టం ఉండదు. అయితే ఒకరి గురించి ఒకరు చెప్పుకొంటారు. ఒకరి ఇష్టాలు మరొకరికి తెలుస్తాయి. ఒకరి లక్ష్యాలు మరొకరికి అర్థమవుతాయి. ఆ తర్వాత ఒకరి జీవితాన్ని మరొకరు ఎలా ప్రభావితం చేసుకొన్నారు? వీళ్లిద్దరూ కలిశారా? అనేది తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే...: దర్శకుడు చాలా సున్నితమైన కథని ఎంచుకొన్నాడు. మెలోడ్రామాకి చోటివ్వని సన్నివేశాల్ని రాసుకొన్నాడు. దాంతో ప్రతీ సన్నివేశం అత్యంత సహజంగా తెరపైకొచ్చింది. కథానాయకుడి పాత్ర చిత్రణ, అతని పాట్లు, చుట్టూ ఉన్న స్నేహితుల వ్యవహారాలు అన్నీ సరదాగా ఉంటాయి. పెళ్లి చూపుల ఘట్టం కూడా ఆకట్టుకొనేదే. ఆ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినా... ఎక్కడా విసుగు రాదు. కథ రీత్యా అంతకు ముందు ప్రశాంత్, చిత్రలకు ఒకరికి మరొకరు పరిచయమే ఉండరు. కానీ ఒకరి కథ మరొకరు చెప్పుకొనే క్రమంలో ఏదో ఓ చోట... వాళ్లిద్దరి కథకి ముడి వేయడం బాగుంది. దాన్ని బట్టి స్క్రీన్ ప్లేని దర్శకుడు ఎంత పకడ్బందీగా రాసుకొన్నాడో అర్థమవుతుంది.
ప్రతి పాత్ర ప్రాధాన్యం ఉన్నదే. ఇంట్రవెల్‌లో వేసిన చిన్న ట్విస్టు కూడా నచ్చుతుంది. ఒకవేళ అది లేకపోయినా కథకొచ్చే ఇబ్బందేం ఉండదు. దర్శకుడు ఏం చెప్పాలనుకొన్నా... దానికి స్వీట్ టచ్ ఇచ్చాడు. వినోదపు పూత పూశాడు. దాంతో సరదాగా సాగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్థం కాస్త నెమ్మదిస్తుంది. కాకపోతే... కథానాయకుడి స్నేహితుల పాత్రలు వినోదం పంచిపెట్టడంతో ఆ లోటు కూడా కనిపించదు. పతాక సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. రేడియో ద్వారా హీరో, హీరోయిన్లు ఒక్కటవ్వడం కొత్తగానే ఉన్నా, ఆ ఎపిసోడ్‌కి అంతగా కనెక్ట్ అవ్వలేరు. మొత్తానికి ఓ ఫ్రెష్ ఫీలింగ్‌తో మొదలైన సినిమా... కాలక్షేపానికి ఢోకా లేకుండా సాగిపోయింది.
ఎవరెలా చేశారంటే..: నటీ నట బృందంలో ఎవ్వరూ పెద్దగా అనుభవజ్ఞులు కాదు. కానీ... ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు. కాస్టింగ్ చాలా పక్కాగా కుదిరింది. 'ఎవడే సుబ్రమణ్యం'లో చూసిన విజయ్ దేవరకొండ ఇందులో మరింత కొత్తగా కనిపిస్తాడు. ప్రేమకథలకు, ఈతరహా చిత్రాలకూ బాగా నప్పుతాడన్న భరోసా కల్పించాడు. తనతో పోలిస్తే రీతూవర్మ నటన తేలిపోయిందనిపిస్తుంది. కానీ విడిగా చూస్తే... రీతూ నటనకూ మంచి మార్కులు పడతాయి. కథానాయకుడి స్నేహితుడిగా నటించిన ప్రియదర్శన్ నటన, అతని సంభాషణలు గుర్తిండిపోతాయి. తెలుగు తెరకు మరో కమెడియన్ దొరికినట్టే. వివేక్ సాగర్ పాటలు ఎప్పుడొచ్చాయో... ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా అర్థం కాదు. కథలో అంతలా మమేకం అయిపోయాయి. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి కొత్త కళ తీసుకొచ్చింది. మాటలు ఆకట్టుకొంటాయి. దర్శకుడు తన తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు.
బలాలు + కథ, కథనం + పాత్రల చిత్రణ + వినోదం + సంగీతం
బలహీనత - అక్కడక్కడ స్లో నేరేషన్ - క్లైమాక్స్
చివరగా: మన సరదాలకూ, కాలక్షేపానికీ ఎలాంటి కొదవ లేని చిత్రం. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఈ సినిమా కి మాగల్ఫ్ వారి రేటింగ్ : 3.5/5
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









