‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

- January 23, 2026 , by Maagulf
‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్: మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమ పై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కూకట్‌పల్లి రంగధాముని/ఐడీఎల్ చెరువు వద్ద సీపీ, పోలీసు సిబ్బందితో కలిసి హెల్మెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, “స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఈ ప్రమాదాలను తగ్గించడమే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి 13 నుంచి 23 వరకు ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీలు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వాములుగా చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపూర్ ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) డాక్టర్ గజరావు భూపాల్ మాట్లాడుతూ, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి చర్యల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని అన్నారు.హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.

బాలానగర్ హెచ్‌ఏఎల్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితీరాజ్, ఐపీఎస్. మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్య చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలన్నదే పోలీసుల లక్ష్యమని అన్నారు.

మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. వేగ పరిమితులను మించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతుందని, నిర్ణయించిన వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ–I రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు మన భద్రత కోసమేనని అన్నారు. రోడ్డుపైకి వచ్చినప్పుడు కుటుంబాన్ని గుర్తు చేసుకుని నెమ్మదిగా, నియమాలు పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు.

కూకట్‌పల్లిలోని ఎన్‌ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు.

మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఏసీపీ శ్రీధర్ మాట్లాడుతూ, వాహనదారులు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు.

మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, యువత, మహిళల ద్వారా కుటుంబాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు. సూరారం నార్త్ సిటీ పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

మియాపూర్ విశ్వనాథ్ గార్డెన్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ, కూకట్‌పల్లి, మాదాపూర్, దుండిగల్, గండిమైసమ్మ చౌరస్తా, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్‌లను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. కొండపూర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీను బాబు మాట్లాడుతూ, పాదచారులు తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని సూచించారు.

కొండపూర్ ఆర్‌టీఓ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ, వాహనం ఉపయోగించే ముందు అన్ని అనుమతులు, పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి అని తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా పోలీసు అధికారులు ప్రజలతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పలు పాఠశాలల్లో క్విజ్, రంగోలి, వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన పెంచారు. హెల్మెట్ పంపిణీ, ప్రతిజ్ఞలు, ప్రమాద బాధితుల గాథల ద్వారా ప్రజలకు మరింత స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపట్టారు.

‘అరైవ్ అలైవ్’ – ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలనే సంకల్పంతో సైబరాబాద్ పోలీసులు ప్రజలతో కలిసి రహదారి భద్రతకు నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని అధికారులు తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, మొబైల్ వాడకపోవడం, జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటడం వంటి జాగ్రత్తలే క్షేమంగా ఇంటికి చేరే మార్గాలని మరోసారి గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com