నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- February 27, 2026
సైబరాబాద్: నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ మోసాలకు సహకరిస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుల్లో జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీ షరీఫ్‌కు చెందిన జవ్వాద్ ఖాద్రీ రిఫాయి, మహమ్మద్ నౌషాద్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా ఒక షట్టర్‌ను అద్దెకు తీసుకుని, 'స్టార్ అగ్రో ఇండస్ట్రీస్' పేరుతో నకిలీ అద్దె ఒప్పందాలు, తప్పుడు వ్యాపార పత్రాలను సృష్టించారు.
ఈ నకిలీ పత్రాల ఆధారంగా జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేల్స్ మేనేజర్ పాముల ప్రణవరాజ్, బ్రాంచ్ మేనేజర్ శంకర్ రాథీ సహకారంతో కరెంట్ ఖాతా ప్రారంభించారని తెలిపారు. ఖాతా తెరిచిన వెంటనే దానికి సంబంధించిన ఏటీఎం కార్డు, చెక్ బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో పాటు సిమ్ కార్డును కూడా సైబర్ మోసగాళ్లకు అప్పగించారన్నారు.దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 2025లో ఈ ఖాతా ద్వారా సుమారు రూ. 6.67 లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. నిందితులు పరారీలో ఉండగా, ఫిబ్రవరి 26, 2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
సైబర్ క్రైమ్స్ పోలీసు విచారణలో..సదరు బ్యాంకు శాఖలోనే దాదాపు 30కి పైగా మ్యూల్ ఖాతాలు తెరిచినట్లు నిందితులు అంగీకరించారన్నారు.ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సభ్యులను, బాధితుల వివరాల కోసం దర్యాప్తు చేస్తామన్నారు.డబ్బు కోసం బ్యాంక్ ఖాతాలు, కేవైసీ పత్రాలను ఇతరులకు ఇవ్వడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.బ్యాంకు సిబ్బంది నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా http://cybercrime.gov.inపోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!







