దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- November 25, 2026
దుబాయ్: దుబాయ్‌లో ఇళ్ల అద్దెలు తగ్గుముఖం పట్టడంతో అద్దెదారులకు చర్చించే అవకాశం పెరిగింది. తక్కువ అద్దెకు మెరుగైన ఇళ్ల కోసం చాలామంది కొత్త ఇళ్లకు మారుతున్నారు. 2026 మూడో త్రైమాసికానికి సంబంధించిన JLL నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అద్దెలు తగ్గడంతో ఇంటి యజమానుల కంటే అద్దెదారులకే ఎక్కువ వెసులుబాటు లభిస్తోంది. పాత ఇళ్లలోనే కొనసాగడం కంటే తక్కువ అద్దెకు మెరుగైన వసతి కోసం కొత్త ఇళ్లకు మారేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్‌లో అద్దె ఒప్పందాల పునరుద్ధరణలు ఏడాది ప్రాతిపదికన 2.4 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 8.3 శాతం మాత్రమే పెరిగాయి.
కొత్త అద్దె ఒప్పందాల్లో పెరుగుదల
2026 మూడో త్రైమాసికంలో దుబాయ్‌లో కొత్త అద్దె ఒప్పందాల నమోదు గత త్రైమాసికంతో పోలిస్తే 48.6 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.7 శాతం పెరిగింది. పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఇళ్ల అద్దెకు తీసుకునే వారి సంఖ్య పెరగడం కూడా ఇందుకు కారణమైంది. మొత్తం అద్దె రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో దుబాయ్‌లో సగటు ఇళ్ల అద్దెలు 5.2 శాతం తగ్గాయి. అపార్ట్‌మెంట్ అద్దెలు 5.3 శాతం, విల్లాల అద్దెలు 3 శాతం పడిపోయాయి.
రియల్ ఎస్టేట్ సేల్స్ డల్
దుబాయ్‌లో ఆస్తుల కొనుగోలు, విక్రయాల కార్యకలాపాలు కూడా గతంలో ఉన్న గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గాయి. మొత్తం ప్రాపర్టీ లావాదేవీలు ఏడాది ప్రాతిపదికన 37.7 శాతం తగ్గాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విక్రయాలు (Off-plan Sales) 41.8 శాతం పడిపోగా, ఇప్పటికే నిర్మించిన ఇళ్ల పునర్విక్రయాలు (Secondary Market Sales) 24.9 శాతం తగ్గాయి. అయితే త్రైమాసిక గణాంకాల్లో కొంత భిన్నమైన పరిస్థితి కనిపించింది. పునర్విక్రయ లావాదేవీలు 19.8 శాతం పెరగడంతో, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విక్రయాల్లో నమోదైన 9.1 శాతం తగ్గుదల ప్రభావం కొంత తగ్గింది. దీంతో మొత్తం త్రైమాసిక విక్రయాల తగ్గుదల 2.2 శాతానికి పరిమితమైంది.
విల్లాల ధరలు ఏడాది ప్రాతిపదికన 2.2 శాతం పెరగగా, అపార్ట్‌మెంట్ల ధరలు 0.9 శాతం తగ్గాయి. రెండో త్రైమాసికంలో 2 నుంచి 3 శాతం వరకు నమోదైన త్రైమాసిక ధరల తగ్గుదల, మూడో త్రైమాసికంలో 1.6 నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. అబుధాబిలోనూ మొత్తం ప్రాపర్టీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 9.6 శాతం తగ్గాయి. ఈ ఏడాదిలో అక్కడ వార్షిక ప్రాతిపదికన విక్రయాలు తగ్గడం ఇదే తొలిసారి.
కొత్త ప్రాజెక్టులకు బ్రేక్
దుబాయ్‌లో మూడో త్రైమాసికంలో దాదాపు 14,000 కొత్త నివాస యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం నివాస యూనిట్ల సంఖ్య సుమారు 923,700కు చేరింది. నాలుగో త్రైమాసికంలో మరో 17,000 యూనిట్లు పూర్తయ్యే అవకాశం ఉంది.
నిర్మాణ చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు ఎక్కువగా నిర్ణీత సమయానికే పూర్తవుతున్నప్పటికీ, ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా గడువులు మారుతున్నాయని JLL తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన కొన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులు కూడా వాయిదా పడ్డాయని పేర్కొంది. దీంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఆర్థిక వనరులు ఉన్న సంస్థలు పెరుగుతున్న వ్యయాలను తట్టుకుని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలవని JLL పరిశోధన విభాగం వెల్లడించింది.
JLL మిడిలీస్ట్, ఆఫ్రికా పరిశోధన విభాగాధిపతి తైమూర్ ఖాన్ మాట్లాడుతూ.. నిర్మాణ నాణ్యత, ఇళ్ల విస్తీర్ణం, అందించే సౌకర్యాలను కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. పెరుగుతున్న నిర్మాణ వ్యయాల కారణంగా ధరలు మరింత తగ్గే అవకాశం పరిమితంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సౌకర్యవంతమైన చెల్లింపు పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..







