భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

- March 04, 2026 , by Maagulf
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబై: పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది.మరో వైపు ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్‌ జలసంధిని ఏ నౌక దాటాలని చూసినా నిప్పుపెడతామని ఇరాన్‌ చేసిన హెచ్చరికలతో చమురు ధరలు పెరుగుతున్నాయి.ఈ అంతర్జాతీయ పరిణామాలు రానున్న రోజుల్లో దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని అనిశ్చితి మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. దీంతో బుధవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 1,700 పాయింట్ల మేర క్షీణించింది. నిఫ్టీ 24,400 దిగువున కదలాడుతోంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,670 పాయింట్ల మేర పతనమై 78,565 వద్ద ఉంది. నిఫ్టీ 513 పాయింట్లు కోల్పోయి 24,351 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. లార్సెన్‌, టాటా స్టీల్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో ఉన్నాయి. దక్షిణ కొరియా కొస్పి 12 శాతం మేర పడిపోయింది. దాంతో ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కాగా.. భారత్‌ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలై ఐదు రోజులు అవుతుండగా.. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. యుద్ధం తీవ్రమవుతుండటంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ మదుపర్లను అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. భారత్‌లో ద్రవ్యోల్బణం, ఆర్థికవృద్ధిపై ఈ ప్రభావం గురించి ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధం ముదురుతూ ఉంటే.. వాణిజ్యలోటు పెరుగుతుందని, రూపాయి బలహీనపడుతుందని, కార్పొరేట్‌ ఆదాయాలపై ఒత్తిడి ఉంటుందని జియోజిట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్ కుమార్‌ అంచనా వేశారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీలో లార్సెన్‌ అండ్‌ టర్బో స్టాక్‌ 7 శాతం మేర కుంగింది. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 3.5 శాతం క్షీణించింది. వార్‌ ఎఫెక్ట్‌తో అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి, జీవనకాల కనిష్ఠాలకు పడిపోయింది. నేటి సెషన్‌లో 69 పైసలు కోల్పోయి, ఏకంగా 92.18 మార్క్‌ను తాకింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com