జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

- March 09, 2026 , by Maagulf
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. భారతీయ విద్యార్థులకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండగా, విదేశీ విద్యార్థులు ఏప్రిల్ 6 నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 17న పరీక్ష; ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష మే 17, 2026న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను మే 11 నుండి పరీక్ష రోజు వరకు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది: పేపర్-1 ఉదయం 9 నుండి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుండి 5:30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ రెండు పేపర్లకు హాజరు కావాలి; ఏదైనా ఒక పేపర్ మిస్ అయినా వారిని మెరిట్ జాబితాలోకి తీసుకోరు.

పరీక్ష ఫలితాలు జూన్ 1, 2026న ఉదయం 10 గంటలకు వెల్లడవుతాయి. ఉత్తీర్ణులైన వారికి జూన్ 2 నుంచి ‘జోసా’ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఆర్కిటెక్చర్ విభాగంలో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT 2026) కోసం జూన్ 1, 2 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏఏటీ పరీక్ష జూన్ 4న నిర్వహించి, జూన్ 7న ఫలితాలను విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్ పేపర్-1లో మొదటి 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన వారు మాత్రమే ఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com