తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- March 09, 2026
హైదరాబాద్: మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రతతో ప్రజలు బయటకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలాఉంటే ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతీయేటా ఎండల తీవ్రతతో వడదెబ్బ బారినపడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అలా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50వేలు పరిహారం అందిస్తూ వచ్చేది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండాకాలంలో వదదెబ్బతాకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచింది. రూ.50వేల నుంచి రూ.4లక్షలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ చట్టం (ఎస్డీఎంఏ) ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ పరిహారం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధారాలతో కూడిన కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది.
వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు గతంలో ప్రభుత్వం రూ.50వేలు పరిహారంగా అందించేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిహారాన్ని రూ.4లక్షలకు పెంచింది. అయితే, ఈ పరిహారం పొందాలంటే దరఖాస్తు చేసుకునే సమయంలో పలు సర్టిఫికెట్లను పొందుపర్చాల్సి ఉంటుంది. మండల స్థాయిలో వైద్యశాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ మరణాలను నిర్ధారించాలి. ఎవరైనా వ్యక్తులు వడదెబ్బకు చనిపోయారని అనుమానం వస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం చేయించాలి. మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా రిపోర్టు ఆధారంగానే దీనికి సంబంధించిన పరిహారానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటే బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని.. అదీకూడా.. వడదెబ్బ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండల సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తెల్లని రంగు కలిగిన వస్త్రాలు ధరించడం మేలు. లేదంటే లైట్ కలర్ దుస్తులు ధరించాలి. వేసవిలో నీరు, ఇతర ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. శీతలపానియాలు, మత్తు పానీయాల జోలికి వెళ్లొద్దు. నెత్తిన టోపీ లేదా కర్చీప్ లేదంటే గొడుగు వంటివి వాడటం మంచిది. తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కువ నీటిని తాగాలి. వడదెబ్బకు గురైనట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









