షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- March 17, 2026
షిర్డీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, గ్యాస్ సంక్షోభం తరుముకొచ్చిన వేళ, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సౌర శక్తి వినియోగంతో వేల సంఖ్యలో భక్తుల ఆకలిని తీరుస్తూ, పర్యావరణ హితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు ఏకంగా 40 వేల మంది భక్తులకు సూర్యరశ్మి సాయంతో వండిన వేడివేడి ప్రసాదాన్ని అందిస్తోంది షిర్డీ ట్రస్ట్. షిర్డీ ప్రసాదాలయంలో సుమారు 1.37 కోట్ల రూపాయల వ్యయంతో 2009లోనే ఈ సోలార్ కుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 73 సోలార్ డిష్‌ల సాయంతో సూర్యరశ్మిని కేంద్రీకరించి, 150 లీటర్ల సామర్థ్యం ఉన్న 10 భారీ కుక్కర్లతో ఇక్కడ వంట చేస్తారు. ఏక కాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను ఉడికిస్తారు. సాధారణంగా ఇంతటి స్థాయిలో వంట చేయాలంటే రోజుకు 1,700 కిలోల గ్యాస్ అవసరమయ్యేది. దీంతో సాయిబాబా సంస్థాన్‌పై గణనీయమైన ఆర్థిక భారం పడేది. పెరుగుతున్న ఖర్చులు, గ్యాస్ పొదుపు ఆవశ్యకతను గుర్తించిన సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల మండలి 2009 లో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ‘సోలార్ కుకింగ్ సిస్టమ్’ ఏర్పాటు చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రసాదాలయం ఆవరణలో 73 సౌర ఫలకాలను అమర్చారు. ఈ ఫలకాలు సూర్యకిరణాల నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఆ ఉష్ణాన్ని ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తారు. ఈ విధానం ద్వారా ప్రతిరోజూ సుమారు 2,800 కిలోల ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవిరిని ఉపయోగించి భారీ సామర్థ్యం కలిగిన ప్రెషర్ కుక్కర్లలో ప్రసాదాలయంలో ఆహారాన్ని వండుతున్నారు. శిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రసాదాలయంలో 150 లీటర్ల సామర్థ్యం కలిగిన పది భారీ వంట పాత్రలను ఏర్పాటు చేసింది.
ఈ పాత్రల సహాయంతో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ‘సోలార్ కుకింగ్ సిస్టమ్’ ద్వారా ఏకకాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను వండగలుగుతున్నారు.
ఈ విధానాన్ని ఉపయోగించి ప్రతిరోజూ సుమారు 2,000 కిలోల ఆహారాన్ని తయారుచేస్తున్నారు. ఇది దాదాపు 40,000 మంది భక్తులకు సరిపోతోంది. 2009 నుంచి 2026 మధ్య కాలంలో ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 2 లక్షల కిలోలకు పైగా గ్యాస్‌ను ట్రస్ట్ ఆదా చేసింది. దీనివల్ల దాదాపు 2 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. కేవలం వంటకే కాకుండా, భక్తుల సౌకర్యార్థం సాయి ఆశ్రమం ఇతర వసతి గృహాల్లో 10 వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా వేడి నీటిని అందించేందుకు కూడా సౌర శక్తిని వాడుతున్నారు. రోజుకు 80 వేల మంది భక్తులు సాయి దర్శనానికి వస్తుండగా, అందులో సగం మంది ప్రసాదాలయంలో భోజనం చేస్తున్నారు. ఇంధన ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో షిర్డీ ట్రస్ట్ అనుసరిస్తున్న ఈ విధానాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ఒక ‘యూనిక్ మోడల్’గా గుర్తించి గౌరవించింది. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో షిర్డీ సాయి సంస్థాన్ నిరూపిస్తోంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









