'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- April 10, 2026
యూఏఈ: యూఏఈలో ఇప్పుడు 'లుక్స్ మాక్సింగ్' అని పిలవబడే ఒక సోషల్ మీడియా ట్రెండ్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఫేస్ నుంచి బాడీ స్ట్రక్చర్ వరకు పాకులాడే యువకులలో ఇది ప్రాచుక్యం పొందుతోంది. అయితే, అందం కోసం చేసే ఈ ప్రయత్నం మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటికీ నష్టం కలిగించవచ్చని యూఏఈ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టార్గెట్ యూత్
టిక్‌టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ ట్రెండ్, ఫిట్నెస్, వ్యక్తిగత శుభ్రత మరియు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లేదా అసురక్షిత పద్ధతుల మిక్సింగ్ ద్వారా తమ రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి పురుషులను ప్రోత్సహిస్తుంది. ఆన్లైన్లో ఒక ఆలోచనగా ప్రారంభమై ఇప్పుడు యూత్ లో బాగా పాపులర్ అవుతోంది. కాగా, ఇటీవల ఈ ట్రెండ్ విస్తృతంగా వైరల్ కావడంపై మానసిక ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాయ్స్, యువకులలో తమ రూపానికి సంబంధించిన ఆందోళనలు వేగంగా పెరుగుతున్నాయని మెడ్కేర్ కమాలి క్లినిక్‌లోని మానసిక ఆరోగ్య నిపుణుడు విస్సాం అల్ మస్సాదే అన్నారు.
ఇటీవల లైఫ్ స్టైల్ పై సోషల్ మీడియా ఎఫెక్ట్ అధికంగా ఉంటుందన్నారు. కాలక్రమేణా, ఇది వారు తమ రూపంతో సంతృప్తి చెందడం కష్టతరం అవుతుందని హెచ్చరించారు. ఇది వ్యామోహంగా మారినప్పుడు అసలు సమస్య మొదలవుతుందన్నారు. "రూపం గురించిన ఆలోచనలు నిరంతరంగా మరియు బాధాకరంగా ఉన్నప్పుడు, లేదా అవి రోజువారీ జీవితం మరియు సంబంధాలను ప్రభావితం చేయడం ప్రారంభించినప్పుడు అది ఆందోళనకరంగా మారుతుంది." అని ఆయన అన్నారు. నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం, పదేపదే అద్దంలో చూసుకోవడం, ఎంత మెరుగుపరుచుకున్న సరిపోదనే భావన వంటి ప్రవర్తనలను ఆయన ఉదహరించారు. ఈ తరహా ఒత్తిళ్లు కేవలం మానసికమైనవి మాత్రమే కాదని, అవి క్లినిక్‌లలో కూడా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు.
యువకులే అధికం
మెడ్కేర్ మెడికల్ సెంటర్లోని డెర్మటాలజీ మరియు ఈస్తటిక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ మహా సుల్తాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఎక్కువ మంది యువకులు చర్మ సంరక్షణ మరియు స్వరూపంపై సలహాలు కోరుతున్నారని చెప్పారు. “మొటిమలు, చర్మం రంగులో తేడాలు, లేదా చిన్న వయసులోనే జుట్టు పలచబడటం వంటి సమస్యలతో వచ్చే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.” అని ఆమె అన్నారు.
అయితే, ఆన్లైన్ ట్రెండ్ల ప్రభావంతో చాలా మంది అసురక్షిత పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె హెచ్చరించారు. "కొంతమంది సరైన మార్గదర్శకత్వం లేకుండా చికిత్సలు లేదా ఉత్పత్తులను ప్రయత్నిస్తారు. దీనివల్ల చర్మానికి హాని కలిగి, పరిస్థితి మరింత దిగజారవచ్చు." అని ఆమె అన్నారు. లైసెన్స్ లేని వారు చేసే చికిత్సల వల్ల ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలు లేదా శాశ్వత మచ్చలు ఏర్పడవచ్చని తెలిపారు.
స్టెరాయిడ్లు లేదా నియంత్రణ లేని సప్లిమెంట్లు
అబుదాబిలోని బుర్జీల్ హాస్పిటల్లో ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మర్వా మొహమ్మద్ మాట్లాడుతూ.. ముఖ్యంగా 20 ఏళ్ల వయస్సులో ఉన్న యువకులు ఒక నిర్దిష్ట శరీరాకృతిని సాధించడానికి స్టెరాయిడ్లు లేదా నియంత్రణ లేని సప్లిమెంట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. "ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇది ఇకపై అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లకు మాత్రమే పరిమితం కాలేదు. సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లేవారే ఉంటున్నారు." అని అన్నారు. ఇలాంటి ధోరణుల వల్ల ఆరోగ్యపరమైన ప్రమాదాలు తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరించారు.
"స్టెరాయిడ్ల వాడకం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, నీరసం, మానసిక స్థితిలో మార్పులు, ఇంకా డిప్రెషన్‌కు కూడా దారితీస్తుంది. ఇది సంతానోత్పత్తి మరియు లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది." అని ఆమె అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో కూడా కాలేయం, మూత్రపిండాలు మరియు గుండెకు ప్రమాదాలు కనిపిస్తాయన్నారు. "కొన్ని వారాలు కూడా శరీరం సహజ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. కోలుకోవడానికి నెలలు పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో, వైద్య సహాయం లేకుండా ఈ ప్రభావాలు పూర్తిగా తొలగిపోకపోవచ్చు." అని ఆమె అన్నారు.
అనేక మంది యువకులు అపోహల ప్రభావానికి లోనవుతున్నారని నిపుణులు తెలిపారు. "జిమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ స్టెరాయిడ్లు వాడుతున్నారని, లేదా స్వల్పకాలిక వాడకం సురక్షితమని ఒక నమ్మకం ఉంది. కానీ అది నిజం కాదు. దీని దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి." అని డాక్టర్ మర్వా అన్నారు.
మానసిక ఆరోగ్యం పై ప్రభావం
శారీరక ప్రమాదాలతో పాటు, ఈ ధోరణిని అదుపు చేయకపోతే అది దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్యూటీపై నిరంతరం దృష్టి పెట్టడం నెమ్మదిగా ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుందని అల్ మస్సాదేహ్ అన్నారు. "ఒక వ్యక్తి విలువ కేవలం వారి రూపానికే ముడిపడి ఉంటే, అది ఆందోళన, నిరాశ, మరియు ఆరోగ్యకరమైన గుర్తింపును ఏర్పరచుకోవడంలో ఇబ్బందికి దారితీయవచ్చు." అని ఆయన అన్నారు. స్వీయ-అభివృద్ధి అనేది స్వతహాగా హానికరం కాదని, అయితే అది సమతుల్యంగా మరియు వాస్తవికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
" ప్రాథమిక చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు వృత్తిపరమైన మార్గదర్శకత్వం సురక్షితమైన మరియు శాశ్వత ఫలితాలను సాధించడంలో సహాయపడతాయి." అని డాక్టర్ మహా సుల్తాన్ అన్నారు. యువత తక్షణ పరిష్కారాల కంటే దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని, అలాగే ఏవైనా చికిత్సలు లేదా సప్లిమెంట్లను ప్రయత్నించే ముందు అర్హులైన నిపుణుల సలహా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్‌ను జయించి..మారథాన్ రన్నర్‌గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!









