ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..

- April 10, 2026 , by Maagulf
ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..

దోహా: ఖతార్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఖతార్ ఇంధన వ్యవహారాల రాష్ట్ర మంత్రి మరియు QatarEnergy అధ్యక్షుడు, సీఈఓ సాద్ షెరీదా అల్-కాబీతో దోహాలో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ శాంతి భద్రతల పై విస్తృతంగా చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, అలాగే ఖతార్ ప్రధాని మరియు విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానిలకు శుభాకాంక్షలు, ఐక్యతా సందేశాన్ని జైశంకర్ అందజేశారు. మార్చి 2026లో ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ మధ్య జరిగిన రెండు టెలిఫోన్ సంభాషణలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను సంభాషణ, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించి శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అత్యవసరతను ఇరువురు నేతలు అప్పుడే నొక్కిచెప్పినట్లు పేర్కొన్నారు.

ఖతార్‌లో భారతీయ సమాజానికి అందిస్తున్న సహకారం, సంక్షేమ చర్యలపై అమీర్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కూడా జైశంకర్ ప్రస్తావించారు.

సమావేశంలో భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాల పై చర్చ జరిగింది. ఉన్నత స్థాయి పర్యటనలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధం వంటి అంశాల్లో మరింత సహకారం పెంపొందించాలని ఇరుపక్షాలు ఆకాంక్షించాయి. ప్రాంతంలో త్వరితగతిన శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా సాద్ షెరీదా అల్-కాబీ, ఖతార్ భారత్‌కు విశ్వసనీయ ఇంధన సరఫరాదారుగానే కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. భారత్‌తో ఇంధన రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపారు.

ఏప్రిల్ 8న కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరువురు స్వాగతించారు. ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయాలు తొందరగా ముగిసి, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్య సరఫరా గొలుసులు సజావుగా కొనసాగేందుకు సముద్ర మార్గాల్లో నిర్బంధం లేని నావిగేషన్ స్వేచ్ఛ ఎంతో కీలకమని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భారత రాయబారి విపుల్ కూడా పాల్గొన్నారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com