ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- May 13, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికిగానూ ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని సి.ఆర్. మీడియా అకాడమీ, అవార్డుల కమిటీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ వెల్లడించారు. మొత్తం12 కేటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు. బుధవారం విజయవాడలో సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో ఆలపాటి సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. 30 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న జర్నలిస్టుకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తామన్నారు. ఈ అవార్డుకు ఎంపికైన వారికి రూ. 3 లక్షల నగదు బహుమతిగా అందజేస్తామని చెప్పారు.
ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు పదేళ్ల అనుభవం, బ్యూరో చీఫ్, డెస్క్‌లో వర్కు చేసి ఉండాలని తెలిపారు. ఈ అవార్డు కింద రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. ఇతర అవార్డులకు ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు పురస్కారం అందిస్తామని చెప్పారు. బి. నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డు పేరు మార్చి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఉత్తమ ఫోటో జర్నలిస్టుకు పదేళ్ల అనుభవం ఉండాల్సి ఉందన్నారు.
చిన్న మీడియా పత్రికలో ఒక ఎడిటర్‌ను అవార్డుకి ఎంపిక చేస్తామని ఆలపాటి సురేశ్ కుమార్ ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక కోసం ఒక కమిటీ వేశామని.. వారు నిర్ణయిస్తారని తెలిపారు. మరికొన్ని అవార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డుకు మూడేళ్లు అనుభవంతోపాటు వారి రిపోర్టింగ్‌ను పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. ఈ అవార్డును ముగ్గురికి ఇస్తామన్నారు.
ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డుకు పదేళ్ల అనుభవం ఉండాల్సి ఉందన్నారు. రిపోర్టింగ్, డెస్క్ జర్నలిస్టుకు ఎంట్రీలు ఆహ్వానిస్తామని చెప్పారు. ఫొటో జర్నలిస్టు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే కార్టూన్ జర్నలిస్టు, ఉత్తమ ఉర్దూ జర్నలిస్టును కూడా ఎంపిక చేస్తామన్నారు. ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డుకు, ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డుకు ఐదేళ్ల అనుభవం ఉన్న వారిని ఎంట్రీలకు ఆహ్వానిస్తామని తెలిపారు.
మా కమిటీ అన్ని అంశాలను పరిశీలించి... త్వరలోనే అవార్డును ప్రకటిస్తామన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా అనుభవం ఉన్న వారంతా ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. జులైలో ఈ అవార్డులు అందచేసేలా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆలపాటి సురేశ్ కుమార్ పేర్కొన్నారు.
చాలా ఏళ్ల విరామం తర్వాత..
గతంలో ఉన్న జి.ఓ ప్రకారం ఈ అవార్డుల ఎంపిక జరుగుతుందని ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఈ అవార్డు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రక్రియ గతంలో 2012లో ఖరారై.. 2017లో ఇచ్చామన్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి.. నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి జులైలో అవార్డులు ప్రకటిస్తామన్నారు. దీనిపై జిల్లాల స్థాయిలో డీపీఆర్ఓ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని డైరెక్టర్ విశ్వనాథన్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









