తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- May 13, 2026
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లలా పర్యాటక ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష..ఇకపై ప్రతి మూడు నెలలకోసారి పర్యాటక శాఖపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడి
తిరుపతి సమీప ప్రాంతాలతో కొత్తగా 'టూరిజం సర్క్యూట్స్' ఏర్పాటు చేయాలని ఆదేశం.. అన్నమయ్య జిల్లాను 'ఎకనామిక్ డిస్ట్రిక్ట్'గా మార్చడమే లక్ష్యం.. నెల్లూరు తీరంలో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు
హార్సిలీహిల్స్ ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు..జూలైలో మైపాడు బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ.. మైపాడు బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడి.. పర్యాటకుల భద్రత, బీచ్ పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టాలని సూచన
పర్యాటక ఆస్తుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు తప్పవని మంత్రి హెచ్చరిక
తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 'ఐకానిక్ గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో జిల్లా పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన మంత్రి దుర్గేష్ పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను త్వరితగతిన పట్టాలెక్కించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇన్వెస్టర్లకు అవసరమైన భూములను కేటాయించడం, ఇప్పటికే కుదుర్చుకున్న ఎంవోయూల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ల్యాండ్ బ్యాంక్ వివరాలు, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ మరియు కోర్టు కేసుల స్థితిగతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాల పర్యాటక ప్రణాళికలను వివరించారు. కేవలం ఆధ్యాత్మికమే కాకుండా అన్నమయ్య జిల్లాను పర్యాటక రంగం ద్వారా ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలనే "ఎకనామిక్ మోడల్" పై చర్చించి దిశానిర్ధేశం చేశారు. హార్సిలీహిల్స్ ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. విశాలమైన తీర ప్రాంతం ఉన్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్లు, రిసార్టులు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైపాడు బీచ్ ఫెస్టివల్ ను జూలైలో నిర్వహిద్దామని తెలిపారు. మైపాడు బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ క్రమంలో బీచ్ లో పర్యాటకుల భద్రత, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. త్వరలోనే సంబంధిత అధికారులు వచ్చి తనిఖీ చేస్తారని తెలిపారు. పర్యాటక రంగంలో జవాబుదారీతనం పెంచేందుకు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌లో నిబంధనలు ఉల్లంఘించే వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక కళను చాటేలా అన్ని జిల్లాల్లో క్రమం తప్పకుండా పర్యాటక ఉత్సవాలు, ఫెస్టివల్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు మరియు వాటిని గడువులోగా పూర్తి చేయడంపై చర్చించారు.పర్యాటకులు స్థానిక సంస్కృతిని ఆస్వాదించేలా 'హోమ్ స్టే' మరియు 'బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్' వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ డా.రమణ ప్రసాద్, డివిజనల్ మేనేజర్లు శ్రీనివాసరావు (తిరుపతి), జయదేవ్ (నెల్లూరు), జిల్లా పర్యాటక అధికారులు జనార్థన్ రెడ్డి (తిరుపతి), నరేంద్ర (చిత్తూరు), నాగభూషణం (అన్నమయ్య), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం రాజు, ఆయా జిల్లాల యూనిట్ మేనేజర్లు, ప్రజా సంబంధాల అధికారి రవీంద్రారెడ్డి మరియు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం









