సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!

- May 17, 2026 , by Maagulf
సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!

రియాద్: సౌదీ భద్రతా అధికారులు ఒక వారంలో మొత్తం 9,576 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. మే 7 నుండి 13 మధ్య కాలంలో పలు ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 4,865 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 3,319 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 1,392 మంది ఉన్నారు. మొత్తం 11,272 మంది అక్రమ నివాసితులను దేశం నుండి బహిష్కరించారు; అదే సమయంలో, ప్రయాణ పత్రాలను పొందడం కోసం 2,311 మంది ఉల్లంఘనదారులను వారి దౌత్య కార్యాలయాలకు పంపగా, 11,226 మంది ఉల్లంఘనదారులను వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేసుకోవడానికి పంపినట్లు తెలిపింది.

అలాగే, సౌదీలోకి సరిహద్దు దాటి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ అరెస్టు అయిన వారి సంఖ్య మొత్తం 1,500. వీరిలో 38 శాతం మంది యెమెన్ జాతీయులు, 60 శాతం మంది ఇథియోపియా జాతీయులు మరియు రెండు శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.

ఉల్లంఘనదారులకు రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడంలో ప్రమేయం ఉన్న సుమారు 12 మందిని కూడా అరెస్టు చేసినట్టు, ప్రస్తుతం, చట్టపరమైన చర్యలను అమలు చేసే ప్రక్రియలో 26,632 మంది ప్రవాసులు ఉన్నారని,  వీరిలో 25,059 మంది పురుషులు మరియు 1,573 మంది మహిళలు ఉన్నారు.

అక్రమ మార్గాల్లో వచ్చిన వారికి  దేశ భూభాగంలో రవాణా చేసినా, వారికి ఆశ్రయం లేదా మరే ఇతర సహాయం చేసినా... అటువంటి వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1 మిలియన్ సౌదీ రియాల్స్ (SR) వరకు జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

అంతేకాకుండా, రవాణా కోసం ఉపయోగించిన వాహనాలను లేదా ఆశ్రయం కల్పించడానికి ఉపయోగించిన ఇళ్లను జప్తు చేస్తామని కూడా ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబరుకు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ఏవైనా ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com