ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- June 12, 2026
సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ఈ రోజు విజయవంతంగా ముగిసింది. పోలీసు సిబ్బంది మరియు మీడియా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు.
టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పోలీస్ హంటర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ హంటర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు చేసింది. జట్టు తరఫున అద్వైత్ దూకుడైన బ్యాటింగ్‌తో 92 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అనంతరం 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్రైమ్ వారియర్స్ జట్టు పోలీస్ హంటర్స్ బౌలర్ల ధాటికి 73 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పోలీస్ హంటర్స్ జట్టు ఘన విజయం సాధించి టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అద్వైత్ 92 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. టోర్నమెంట్ మొత్తం 180 పరుగులు సాధించిన పోలీస్ హంటర్స్ ప్లేయర్ నరేష్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్, ఐపీఎస్ విజేతలకు ట్రోఫీలు, వ్యక్తిగత అవార్డులు అందజేసి అభినందించారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న అన్ని జట్లను ప్రశంసించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్,మాట్లాడుతూ, పోలీసు శాఖ ఉద్యోగం అయినా, మీడియా ఉద్యోగం అయినా నిరంతర ఒత్తిడితో కూడుకున్నవేనని, రాత్రి వేళల్లో కూడా విధుల నిర్వర్తిస్తూ ఉంటారని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న రెండు వర్గాల మధ్య పరస్పర అవగాహన, స్నేహపూర్వక వాతావరణం మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్‌ను నిర్వహించామని తెలిపారు. మూడు రోజుల పాటు సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 10 జట్లతో నిర్వహించిన ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందించారు. మీడియా ప్రతినిధుల కోరిక మేరకే ఈ క్రికెట్ లీగ్‌ను నిర్వహించామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ బ్యాడ్మింటన్ వంటి ఇతర క్రీడా పోటీలను కూడా నిర్వహిస్తామని సీపీ తెలిపారు.పోలీసు–మీడియా సంబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీ డా.ఎం.రమేష్‌తో పాటు అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, ఎస్‌బీ డీసీపీ సుధీంద్ర, హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీలు హనుమంతరావు, షమీర్, ఆర్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







