డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- June 12, 2026
ముంబై: గ్లామర్ ప్రపంచంలో వెలుగులు వెదజల్లుతున్న ఒక ప్రముఖ మోడల్ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా బుక్కైంది. ‘మిసెస్ కేరళం-2025’ (Mrs Kerala 2025) అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్ హర్షా సన్నీ (Harsha Sunny) భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తూ పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్న రాత్రి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న హర్షా సన్నీ కదలికలపై అక్కడి కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులకు తీవ్ర అనుమానం వచ్చింది. ఆమె ప్రవర్తనలో గందరగోళాన్ని గమనించిన అధికారులు, ఆమెను అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఆమె లగేజీలో దాచి ఉంచిన నిషేధిత మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది.
ట్రాలీ బ్యాగులో రూ.11.82 కోట్ల డ్రగ్స్..కోర్టు రిమాండ్
కస్టమ్స్ అధికారులు హర్షా సన్నీకి చెందిన ట్రాలీ బ్యాగులను క్షుణ్ణంగా స్కానింగ్ చేసి, వాటిని విప్పి తనిఖీ చేయగా అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. అధికారుల కళ్లు గప్పేందుకు అత్యంత చాకచక్యంగా వ్యాక్యూమ్ సీల్డ్ (Vacuum Sealed) ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉంచిన దాదాపు 11 కేజీల బరువున్న హై-క్వాలిటీ డ్రగ్స్ అందులో లభ్యమయ్యాయి. అంతర్జాతీయ నల్లబజారులో పట్టుబడిన ఈ మాదకద్రవ్యాల విలువ సుమారు రూ. 11.82 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చింది, ముంబైలో ఎవరికి సరఫరా చేయాలని చూసిందనే కోణంలో అధికారులు ఆమెను తీవ్రంగా విచారించారు. అనంతరం ఎన్డిపిఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. అందాల పోటీల వేదికలపై మెరిసిన మోడల్ ఇలా డ్రగ్స్ ముఠాతో చేతులు కలిపి జైలుపాలు కావడం సినీ, మోడలింగ్ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







