యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?

- September 17, 2026 , by Maagulf
యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?

దుబాయ్: యూఏఈలో రానున్న నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కొన్ని దీర్ఘకాలిక వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు వర్షపాతం సాధారణ స్థాయిని మించే అవకాశం ఉందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వాతావరణ నిపుణుడు అహ్మద్ హబీబ్ తెలిపారు. అయితే దీనిని భారీ తుఫాన్లు లేదా వరదలకు నేరుగా హెచ్చరికగా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కొన్ని వాతావరణ నమూనాలు అధిక వర్షపాతాన్ని సూచిస్తున్నప్పటికీ, వర్షపాతం ఎంతమేర నమోదవుతుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని తెలిపారు.

ఎల్‌నినో చాలా బలంగా ఉంది
తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేయగలదు. సెప్టెంబర్ 11న NCM ఇచ్చిన వివరణలో ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితిని చాలా బలమైనదిగా పేర్కొంది. ఇది సాధారణంగా అనుకూలమైన వర్షపాతానికి సూచికగా పరిగణించబడుతుందని తెలిపింది. అయితే యూఏఈలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడితే కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు సంబంధించిన సంకేతం మాత్రమేనని NCM నిపుణుడు అహ్మద్ హబీబ్ వివరించారు. యూఏఈలో వాస్తవంగా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయన్నది ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎల్‌నినో యూఏఈని నేరుగా ప్రభావితం చేయదని, వాతావరణ ప్రసరణలో చోటుచేసుకునే విస్తృత మార్పుల ద్వారా పరోక్ష ప్రభావం కనిపించవచ్చని చెప్పారు.
సోషల్ మీడియాలో ఎల్‌నినో కారణంగా యూఏఈలో భారీ వరదలు, అసాధారణ వర్షాలు తప్పవంటూ వస్తున్న ప్రచారాలను కూడా NCM గతంలో ఖండించింది. వర్షాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలు సోషల్ మీడియా పోస్టుల కంటే NCM అధికారిక అంచనాలు, హెచ్చరికలను మాత్రమే ఆధారంగా చేసుకోవాలని సూచించింది.

స్థానిక వాతావరణ పరిస్థితులే కీలకం
ఎల్‌నినో ప్రపంచ వాతావరణ ప్రసరణపై ప్రభావం చూపగలిగినప్పటికీ.. యూఏఈలో వర్షాలు కురుస్తాయా లేదా అన్నది స్థానిక వాతావరణ వ్యవస్థలపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వర్షాలు కురవాలంటే వాతావరణంలో తేమ, నీటి ఆవిరి, భూ ఉపరితల-ఎగువ వాతావరణ ఉష్ణోగ్రతలు, అనుకూలమైన పీడన వ్యవస్థలు వంటి అనేక అంశాలు ఒకేసారి అనుకూలంగా ఉండాల్సి ఉంటుందని హబీబ్ తెలిపారు.
ప్రస్తుతం ఎల్‌నినో సముద్రంలో చురుకుగా ఉన్నప్పటికీ, యూఏఈ ప్రాంతంలోని పీడన వ్యవస్థలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీసే స్థాయిలో లేవని ఆయన పేర్కొన్నారు.

ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగానే..
ప్రస్తుతం యూఏఈలో వాతావరణం క్రమంగా మారుతున్నప్పటికీ, పగటి ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే ఉండే అవకాశం ఉంది. 44°C నుంచి 46°C వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హబీబ్ తెలిపారు. అదే సమయంలో రాత్రివేళల్లో తేమ పెరగడం వల్ల ముఖ్యంగా తీర ప్రాంతాల్లో పొగమంచు లేదా మిస్ట్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com