యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు

- June 13, 2026 , by Maagulf
యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
  • రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మందికి పైగా యూరాలజిస్టుల నమోదు
  • యూరో-ఆంకాలజీ సింప్లిఫైడ్ – 2026 పేరుతో ప్రత్యేక సదస్సు
  • రోబోటిక్ శస్త్రచికిత్సల ప్రత్యక్ష ప్రదర్శనలు
  • ప్రోస్టేట్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లపై ప్రత్యేక చర్చలు
  • సోగస్-ఏపీ ఆధ్వర్యంలో తొలి మిడ్‌టర్మ్ కాన్ఫరెన్స్

విజయవాడ: మూత్రపిండాలు, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలు, శస్త్రచికిత్సా నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న నగరంలో రాష్ట్రస్థాయి వైద్య సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.

సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సోగస్-ఏపీ) ఆధ్వర్యంలో, విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ (వేగస్) సహకారంతో “యూరో-ఆంకాలజీ సింప్లిఫైడ్ – 2026” పేరిట ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యూరాలజీ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, యూరో-ఆంకాలజీ రంగంలో తాజా పరిణామాలను పంచుకునే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించబడుతోంది.

సోగస్-ఏపీ ఏర్పాటైన తరువాత నిర్వహిస్తున్న తొలి మిడ్‌టర్మ్ కాన్ఫరెన్స్ కావడం ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, యువ వైద్యులు, పీజీ విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సు వివరాలను ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ.వి. కృష్ణ కిషోర్, వేగస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సైంటిఫిక్ కన్వీనర్ డాక్టర్ పి. శ్రీమన్నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె. ప్రియతమ్, ఆర్గనైజింగ్ ట్రెజరర్ డాక్టర్ కె. ధీరజ్, పేట్రన్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

డాక్టర్ ఎ.వి.కృష్ణ కిషోర్ మాట్లాడుతూ విజయవాడ నగరం యూరాలజీ అకాడమిక్ కార్యక్రమాలకు ఎప్పటినుంచో ముఖ్య కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. వేగస్ ఆధ్వర్యంలో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి యూరాలజీ సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, ఈ సదస్సు ఆ అకడమిక్ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

వేగస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సైంటిఫిక్ కన్వీనర్ డాక్టర్ పి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ యూరో-ఆంకాలజీ అనేది యూరాలజీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రత్యేక విభాగమని తెలిపారు. ప్రోస్టేట్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్ల నిర్వహణలో ఆధునిక చికిత్సా విధానాలు, క్లిష్టమైన శస్త్రచికిత్సలు, వైద్య నిర్ణయాలపై వైద్యులకు ప్రయోగపూర్వక అవగాహన కల్పించే విధంగా సదస్సు రూపొందించబడిందన్నారు. కేసు ఆధారిత చర్చలు, నిపుణుల ఉపన్యాసాలు, ప్రత్యక్ష శస్త్రచికిత్సల ద్వారా వైద్యులకు ఉపయోగపడే శాస్త్రీయ కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె. ప్రియతమ్ మాట్లాడుతూ ఈ సదస్సులో కేసుల ఆధారిత చర్చలు, వైద్య నిపుణులతో ప్రత్యక్ష పరస్పర చర్చలు, క్లిష్ట కేసుల పరిష్కార మార్గాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యూరాలజీ విభాగంలో శిక్షణ పొందుతున్న యువ వైద్యులు, పీజీ విద్యార్థులకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్గనైజింగ్ ట్రెజరర్ డాక్టర్ కె. ధీరజ్ మాట్లాడుతూ ప్రోస్టేట్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్స కోసం పెద్ద నగరాల్లోని క్యాన్సర్ కేంద్రాలకు వెళ్లాల్సిందేనని చాలామంది రోగులు భావిస్తారని, అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‌పలు కేంద్రాల్లో ప్రపంచ స్థాయి యూరో-ఆంకాలజీ సేవలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సదస్సులో ప్రధానాంశంగా రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ, రోబోటిక్ పార్టియల్ నెఫ్రెక్టమీ శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యక్ష శస్త్రచికిత్సల ద్వారా వైద్యులకు అత్యాధునిక సాంకేతికత పై ప్రత్యక్ష అవగాహన లభిస్తుందని చెప్పారు.

పేట్రన్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ వైద్యరంగంలో జరుగుతున్న వేగవంతమైన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా వైద్యులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి శాస్త్రీయ సదస్సులు వైద్యుల జ్ఞానాన్ని, శస్త్రచికిత్సా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యూరో-ఆంకాలజీ రంగంలో తాజా వైద్య విధానాలు, సాంకేతిక పరిణామాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్య వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రోస్టేట్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యూరాలజిస్టును సంప్రదించాలని నిర్వాహకులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com