22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్‌’ల పై కేంద్రం కీలక నిర్ణయం..

- June 16, 2026 , by Maagulf
22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్‌’ల పై కేంద్రం కీలక నిర్ణయం..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ ‘షెడ్యూల్ కె’ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్) ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేసే మందుల మినహాయింపు జాబితా నుండి “దగ్గు సిరప్‌(Cough Syrup)లను” తొలగించింది. అయితే, దగ్గుకు సంబంధించిన లాజెంజెస్‌లు, పిల్స్ లేదా టాబ్లెట్‌లు మాత్రం యథావిధిగా ఈ మినహాయింపు జాబితాలోనే కొనసాగుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం గతేడాది డిసెంబర్‌లోనే విడుదల చేసి, భాగస్వామ్య పక్షాల నుండి సలహాలను ఆహ్వానించింది.

గతంలో మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్‌లను సేవించడం వల్ల 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయానికి వచ్చింది. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. తనిఖీలు లేకుండా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి సిరప్‌లు విక్రయించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

అదే సమయంలో, రాజస్థాన్‌లో కూడా కొందరు చిన్నారులు దగ్గు సిరప్‌లు తాగి మరణించినట్లు నివేదికలు వచ్చాయి. అయితే ఆ కేసులో చిన్న పిల్లలకు ఇవ్వకూడని, పెద్దలు వాడాల్సిన సిరప్‌లను పిల్లలకు తాగించడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తేలింది. ఇలాంటి పొరపాట్లు, కలుషిత మందుల ముప్పు నుండి ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను రక్షించేందుకే ఇకపై దగ్గు సిరప్‌ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com