ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..

- June 25, 2026 , by Maagulf
ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..

బెంగళూరు: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కీలకంగా ఉన్న తుంగభద్ర నదికి సంబంధించి.. కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో తుంగభద్ర నదిపై నిర్మించిన డ్యామ్‌కు సంబంధించిన గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌లో భాగంగా కొత్తగా 33 క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయగా.. తాజాగా వాటి ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్.. 3 రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

తొలుత హోస్పేట్‌లోని ఐఆర్‌బీ గెస్ట్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రితో సమావేశం అయ్యారు. ఆ తర్వాత తుంగభద్ర డ్యామ్ వద్దకు వెళ్లి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిపి వరుసగా 17, 18, 19, 20వ క్రస్ట్ గేట్లను ప్రారంభించారు. ఆ తర్వాత గుర్తుగా ఒక శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేతులు కలిపి అభివాదం చేస్తూ గ్రూప్‌ ఫొటో దిగారు.

2024 వానాకాలంలో ఆగస్ట్ నెలలో వచ్చిన వరద ప్రవాహానికి తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ.. కొత్త గేట్లను అమర్చాలని సూచించింది. ఈ క్రమంలోనే రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నడ సీఎం డీకే శివకుమార్.. ముగ్గురు ముఖ్యమంత్రులం కలిసి చరిత్ర సృష్టిస్తామని తేల్చి చెప్పారు.

ఆ తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ దక్షిణాది జలవనరుల చరిత్రలో ఒక అపూర్వ ఘట్టమని అభివర్ణించారు. ఈ గేట్ల పునరుద్ధరణ పనులు కేవలం ఓ టెక్నికల్ విజయం మాత్రమే కాదని.. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాల కరువు జిల్లాల సమస్యల పరిష్కారానికి కీలక అడుగు అని పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం సీమ జిల్లాల రైతులతోపాటు.. తెలంగాణలోని పాలమూరు ప్రజల వలసల బాధలు, అక్కడి పరిస్థితులపై తనకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలను పరిష్కరించుకోకపోవడం వల్లే విలువైన జలాలు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే అంతరాష్ట్ర జల వివాదాలపైనా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల మధ్య పంచాయతీలు వద్దని.. కేవలం రైతుల శ్రేయస్సు కోసం సమస్యల పరిష్కారమే కావాలని అన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదంలో చర్చలు ఒక కొలిక్కిరావడం శుభపరిణామం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర నదీ ఒడ్డున జరిగిన ఈ చర్చలు త్వరలోనే కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యలకు కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాయని తాను బలంగా నమ్ముతున్నానని వెల్లడించారు.

ఆ తర్వాత రైతుల హక్కుల గురించి ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన 10 టీఎంసీల నీరు ఇంకా రావడం లేదని ప్రస్తావించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కింద ఉన్న తెలంగాణ రైతులకు కచ్చితంగా న్యాయం కావాలని తాము కోరుతున్నామని.. ఈ విషయంలో కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివాదాలు పక్కనబెట్టి పరస్పరం సహకారంతో ముందుకు సాగితేనే 3 రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com