న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్

- August 11, 2026 , by Maagulf
న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: సకాలంలో న్యాయం అందించాలంటే నేర న్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీస్, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్, వైద్య, ఫోరెన్సిక్, జైళ్ల శాఖలను సాంకేతికతతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ నెల గురువారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో “కొత్త క్రిమినల్ చట్టాలు – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బలోపేతం” అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. తెలంగాణ పోలీసుల సమన్వయంతో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.

సదస్సులో జస్టిస్ మౌషుమి భట్టాచార్య, అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ రెడ్డి, న్యాయ, పోలీస్, జైళ్లు, ప్రాసిక్యూషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

డిజిటల్ ఆధారిత నేర న్యాయ వ్యవస్థ పై సమీక్ష

సదస్సు ఏర్పాట్లలో భాగంగా డీజీపీ సీవీ ఆనంద్ అన్ని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా డిజిటల్ విధానాల పై అధికారులు సిద్ధం చేసిన ప్రజెంటేషన్లను పరిశీలించి, అవసరమైన మార్పులు, సూచనలు చేశారు.

కొత్త క్రిమినల్ చట్టాల అమలులో ఎదురవుతున్న సవాళ్లు, దర్యాప్తు నుంచి విచారణ వరకు వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.

ఈ-సాక్ష్య, ఈ-ఎఫ్‌ఐఆర్‌ పై సాంకేతిక ప్రజెంటేషన్లు

సదస్సులో e-Sakshya, e-FIR, డిజిటల్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యాల నమోదు, డిజిటల్ కేస్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై సాంకేతిక ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.

దర్యాప్తు దశ నుంచి కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు సాక్ష్యాలు, నివేదికలను వేగంగా డిజిటల్ పద్ధతిలో సమర్పించడం ద్వారా న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేయవచ్చని డీజీపీ తెలిపారు.

టైమ్‌లైన్ పాటింపులో తెలంగాణ స్థానం మెరుగుపడాలి

నిర్దేశిత గడువుల్లో కేసుల ప్రక్రియ పూర్తి చేయడం, ఐసీటీ వినియోగం వంటి అంశాల్లో తెలంగాణ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తక్కువ స్థానంలో ఉందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణాల్లో అంతర్‌శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఒకటని తెలిపారు.

చట్టబద్ధమైన గడువులను కచ్చితంగా పాటించడం, సాక్ష్యాలు, నివేదికలను వేగంగా డిజిటల్ విధానంలో సమర్పించడం ద్వారా న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పారు. తెలంగాణ పనితీరును జాతీయ స్థాయిలో మెరుగుపరచడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com