ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!

- June 28, 2026 , by Maagulf
ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జులై 15 నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కొత్త పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వచ్చే వారం రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ నాణ్యమైన వైద్యం అందడమే ఈ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం.

దంపతులకు ఊరట, అదనపు చందాల వాపసు

భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, ఇకపై ఒక్కరి జీతం నుండి మాత్రమే హెల్త్ స్కీమ్ చందా వసూలు చేస్తారు. గత నెలలో పొరపాటున ఇద్దరి నుండి కట్ చేసిన చందాలను తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య సేవల గరిష్ట పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆధునిక చికిత్సలు, ఆయుర్వేద వైద్యం కూడా ఈ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లిస్తేనే ఈ పథకం విజయవంతం అవుతుందని సంఘాల నేతలు సూచించారు.

ఆసుపత్రుల ఎంపిక, తదుపరి కార్యాచరణ

ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించి ప్యాకేజీ రేట్లను ఖరారు చేస్తారు.1885 రకాల వ్యాధులకు విస్తృత చికిత్సలు అందించేలా ఆసుపత్రుల జాబితాను పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.జులై 15 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య నిపుణులు, ట్రస్ట్ సభ్యుల సమక్షంలో తుది నిర్ణయాలు తీసుకుని, పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com