యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...

- July 01, 2026 , by Maagulf
యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (YTD) పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైటీడీ బోర్డుకు ఛైర్మన్​గా ఎమ్​ఎస్​ఎన్​ గ్రూప్(ఫార్మా) ఛైర్మన్​ మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించారు.సభ్యులుగా ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఉన్నారు.చిల్లప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం.రాఘవేంద్ర రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అలాగే ఫౌండర్‌ ట్రస్టీతో కలుపుకుని మొత్తం 18 మంది సభ్యులుగా ఉన్నారు. ఎక్స్-అఫీషియో సభ్యులు, వ్యవస్థాపక ధర్మకర్త మినహా మిగిలిన సభ్యుల పదవీకాలం రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉంటుంది.ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఎక్స్-అఫీషియో సభ్యులు వీరే! 

వైటీడీ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (YTDA) వైస్‌ ఛైర్మన్, దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (EO), స్థానాచార్యులు లేదా సీనియర్‌ ప్రధాన అర్చకుడు పాలకమండలి ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా

యాదగిరిగుట్ట దేవస్థానం ఛైర్మన్‌గా నియమితులైన మన్నె సత్యనారాయణ రెడ్డి ఫార్మాసుటికల్ రంగంలో ప్రముఖ పారిశ్రామికవేత్త. ఎమ్​ఎస్​ఎన్​ గ్రూప్ వ్యవస్థాపక సీఎండీ అయిన ఆయన ఉస్మానియా, పాలమూరు విశ్వవిద్యాలయాల నుంచి ఒక్కో పీహెచ్​డీని పొందారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక కార్యకలాపాలను స్థాపించారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబ్‌పేట మండలం, గురుకుంట ఆయన స్వగ్రామం.మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా గతంలో గెలుపొందిన ఎం.శ్రీనివాస్ రెడ్డి మన్నె సత్యనారాయణ రెడ్డికి సోదరుడే.

భూముల కేటాయింపు పై కొత్త పాలసీ

యాదగిరిగుట్ట పైన వివిధ మఠాలు, కుల సంఘాలకు అలాగే గెస్ట్​ హౌస్​లకు భూములు కేటాయించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంగళవారం యాదగిరిగుట్ట అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్'కు మార్కెట్ ధరలకే భూమిని కేటాయించాలని ఆయన సూచించారు.

భూ యాజమాన్య హక్కులు ఆలయానికే

 కొండ పైన అతిథి గృహాలను నిర్మించడానికి ముందుకు వచ్చిన వారి జాబితాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.దశల వారీగా నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించి, దాని పై వారంలోగా రిపోర్టు సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయ భూ యాజమాన్య హక్కులు ఆలయానికే ఉండాలని స్పష్టం చేశారు.అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో యాదగిరిగుట్టలో టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com