FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

- July 01, 2026 , by Maagulf
FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) 2.0 పోర్టల్తో పాటు ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (e-OCI) కార్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ రెండు డిజిటల్ సేవలు పౌరులకు మరింత సులభమైన సేవలను అందించడంతో పాటు, ఎఫ్‌సీఆర్‌ఏ పోర్టల్ ద్వారా విదేశీ విరాళాలు స్వీకరించే సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గిస్తాయని తెలిపారు. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండి, సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే నిజాయితీగా పనిచేసే వారికి పాలన మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన నిఘా వ్యవస్థ కొనసాగుతుందని, దీంతో దేశ భద్రత మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

ఈ-ఓసీఐ కార్డు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 లక్షలకుపైగా ఓసీఐ కార్డుదారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని అమిత్ షా తెలిపారు. గతంలో ఓసీఐ వ్యవస్థలో ఉన్న సమస్యలను కొత్త విధానంలో పరిష్కరించినట్లు చెప్పారు. ఇకపై 20 సంవత్సరాల తర్వాత కొత్త పాస్‌పోర్ట్ పొందినప్పటికీ ఓసీఐ బుక్‌లెట్‌ను మళ్లీ జారీ చేయాల్సిన అవసరం ఉండదని, కార్డుదారుడి ప్రత్యేక నమోదు సంఖ్య (యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్) యథాతథంగా కొనసాగుతుందని వివరించారు.

ఎఫ్‌సీఆర్‌ఏ 2.0 పోర్టల్ ద్వారా విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశారు. దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ, వార్షిక నివేదికల సమర్పణతో పాటు ఇతర సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించే విధంగా ఈ పోర్టల్‌ను రూపొందించారు.

అదే విధంగా, ఈ-ఓసీఐ కార్డు ద్వారా విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు దరఖాస్తు సమర్పణ, అవసరమైన పత్రాల అప్‌లోడ్, ఆమోదం అనంతరం డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com