సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- July 01, 2026
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లోని బోధి పెవిలియన్‌లో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఎండీ పి.కృష్ణారెడ్డితో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ, హైదరాబాద్ మెట్రోరైల్ అదనపు ఎండీ బి. అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిష్కారాలపై ఇరు సంస్థల ప్రతినిధులు తమ ప్రణాళికలను వివరించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.నగర ట్రాఫిక్ సమస్యలకు సాంకేతికత ఆధారంగా వేగవంతమైన పరిష్కారాలు అందించే విధానాలను వివరించారు. అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం ద్వారా పట్టణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు.
సెన్సర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధ (AI) ఆధారిత వ్యవస్థల ద్వారా సురక్షితమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చని వివరించారు. ట్రాఫిక్ రద్దీని గుర్తించి దానికి అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నళ్లను నియంత్రించడం, నీటి లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలకు మార్గం సుగమం చేయడం వంటి కాగ్నిటివ్ సిటీస్ రూపకల్పనకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రభుత్వాల కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, పౌర సేవలను మరింత మెరుగుపరచడంలో, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇరు సంస్థలు వివరించాయి.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను సమగ్రంగా అనుసంధానం చేయాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నళ్లు స్వయంచాలకంగా పనిచేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ నిర్వహణను ఏఐతో అనుసంధానించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని అధికారులకు, సంస్థల ప్రతినిధులకు సూచించారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. పరస్పర సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







