రివ్యూ: తిక్క
- August 13, 2016
సినిమా: తిక్క నటీనటులు: సాయిధరమ్‌తేజ్.. లరిస్సా బోన్సి.. మన్నారా చోప్రా.. రాజేంద్రప్రసాద్.. ముమైత్‌ఖాన్.. అలీ.. రఘుబాబు.. అజయ్.. తాగుబోతు రమేష్ తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: కె.వి.గుహన్ మాటలు: లక్ష్మీ భూపాల్.. హర్షవర్థన్ నిర్మాత: రోహన్‌రెడ్డి దర్శకత్వం: సునీల్‌రెడ్డి నిర్మాణం: వెంకటేశ్వర మూవీ మేకర్స్
విడుదల: 13-08-2016
ఈ మధ్య వరుస విజయాలతో తన జోరు చూపిస్తున్నాడు సాయిధరమ్ తేజ్. 'పిల్లా నువ్వు లేని జీవితం'.. 'సుబ్రమణ్యం ఫర్ సేల్'.. 'సుప్రీమ్'లతో హ్యాట్రిక్ సాధించాడు. దాంతో తేజూ సినిమా అంటే అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సినిమా 'ఓం'తో ఓ విఫల ప్రయత్నం చేసిన సునీల్‌రెడ్డికి తేజూ అవకాశం ఇచ్చాడంటే.. నిజంగా కథలో ఏదో దమ్ము ఉందనిపిస్తుంది. దానికి తోడు 'తిక్క' అనే టైటిల్ మాస్‌కి నచ్చేసేదే. మరి.. సినిమా కూడా అలానే ఉందా? తేజూ నమ్మకాన్ని సునీల్‌రెడ్డి నిలబెట్టాడా? లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లిపోవాల్సిందే.
కథేంటంటే..: ఆదిత్య (సాయిధరమ్ తేజ్) సరదా కుర్రాడు. మందు.. అమ్మాయిలు.. వాళ్లతో ప్రేమ వ్యవహారాలూ.. ఇదే జీవితం అనుకొంటాడు. కానీ.. అంజలి (లరిస్సా బోన్సి) వచ్చాక అతని జీవితం మారిపోతుంది. అన్ని చెడు వ్యసనాలకూ దూరంగా ఉంటాడు. తనకు ప్రాణమైన నాన్న (రాజేంద్రప్రసాద్)కీ దూరమవుతాడు. అయితే సడన్‌గా ఓ రోజు సిల్లీ కారణాలు సాకుగా చూపించి బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతుంది అంజలి. వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో స్నేహితులతో కలసి చిత్తుగా మందు తాగేస్తాడు ఆదిత్య. ఆ ప్రభావంతో చేసిన హంగామా ఏమిటి? దాని వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి? అంజలి దూరం కావటానికి కారణం ఏమిటి? అసలా ఉత్తరంలో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: హ్యాంగోవర్‌లో ఓ కుర్రాడు.. అతని స్నేహితులు కలసి చేసిన నిర్వాకమే ఈ చిత్రం. దానికి కాస్తంత కన్‌ఫ్యూజన్ డ్రామా మిక్స్ చేసుకొన్నారు. కథ వింటుంటే.. 'లైన్ ఏదో బాగానే ఉందిలే' అనిపిస్తుంది. దాన్ని ఇంకా బాగా తీయాలంటే సన్నివేశాలు బాగా రాసుకోవాలి. పాత్రల మధ్య సంఘర్షణ పండాలి. వినోదం తోడవ్వాలి. అయితే.. 'తిక్క'లో అవన్నీ లోపాలుగానే కనిపిస్తాయి. సినిమా మొదలైన పది నిమిషాలకే.. గాడి తప్పినట్లుగా కనిపిస్తుంది. కారణం కథ.. కథనం రెండూ గజిబిజిగా ఉండడమే.తాగిన మైకంలో చేసిన నిర్వాకాన్ని హైలైట్ చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు తడబడ్డాడు. తొలి సగం పూర్తి అయ్యేసరికి మూడు నాలుగు సినిమాలు కలసి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. తొలిభాగంలో రోడ్డుపై ఓ ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆ ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగుతుంది. ఛేజింగ్ తెరకెక్కించిన విధానం బాగానే ఉన్నా.. మరి అంత సేపు సాగదీయడంలో అర్థం లేదనిపిస్తుంది.ద్వితీయార్థంలో కన్‌ఫ్యూజన్ డ్రామా మొదలైంది. ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేద్దామని దర్శకుడే కన్‌ఫ్యూజ్ అయిపోయాడేమో అనిపిస్తుంది. సినిమాలో చాలామంది నటీనటులున్నారు. అయితే ఎవరినీ సరిగాఉపయోగించుకోలేదు. ఆఖరికి రాజేంద్రప్రసాద్, ఇద్దరు హీరోయిన్లతో సహా.ఎవరెలా చేశారంటే..: సాయిధరమ్ తేజ్‌లోని హుషారు ఇది వరకటి సినిమాల్లో చూశాం. అదే ఈ సినిమాలోనూ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సన్నివేశంలో బలం లేకున్నా.. తన స్పీడుతో ఏదో కవర్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఎంతసేపు సినిమాని ఒంటిచేత్తో లాక్కుని రాగలడు? కథానాయిక పాత్రల ప్రాముఖ్యం అంతంత మాత్రమే. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టారు. తెరపై ఆ ఖర్చు కనిపిస్తుంది. కానీ లాభం ఏముంది? తమన్ పాటలు వినసొంపుగా అనిపించవు. సంభాషణల్లో మెరుపులేమీ కనిపించవు.
బలాలు + సాయిధరమ్ తేజ్ + నిర్మాణ విలువలు
బలహీనతలు - కథ.. కథనం - సాగదీత చివరగా.. ఈ 'తిక్క' భరించాలంటే సహనం అవసరం గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







