విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- July 17, 2026
అబుదాబి: వేసవి సెలవుల నేపథ్యంలో యూఏఈ నుంచి వేలాది మంది విదేశాలకు ప్రయాణిస్తున్న వేళ, హ్యాండ్ లగేజీలో తీసుకెళ్తున్న మెడిసిన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఏఈలో చట్టబద్ధంగా లభించే కొన్ని సాధారణ మందులు ఇతర దేశాల్లో నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
గ్రీస్‌లో కోడైన్ (Codeine) ఉన్న దగ్గు, జలుబు మందులు నియంత్రిత ఔషధాలుగా పరిగణిస్తారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని తీసుకెళ్తే కస్టమ్స్ వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జపాన్‌లో కోడైన్ ఆధారిత మందులను తీసుకెళ్లాలంటే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందే ప్రత్యేక అనుమతి పొందాలి. యూఏఈలో చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పటికీ, జపాన్‌లో నిషేధిత మందులతో పట్టుబడితే అరెస్టు, నిర్బంధం వంటి చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇక మిడిలీస్టులోని కొన్ని దేశాల్లో కూడా కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈజిప్ట్‌లో ట్రామడాల్ (Tramadol) నిషేధిత మెడిసిన్. దానిని తీసుకెళ్తే భారీ జరిమానాలు లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఖతార్‌లో సాధారణంగా మెడికల్ షాపుల్లో దొరికే దగ్గు, జలుబు మందులకు కూడా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరం. అలాగే, దీర్ఘకాలిక చికిత్స పొందుతున్న వారి విషయంలో ఏడీహెచ్‌డీ (ADHD) మందులు, బలమైన నొప్పి నివారణ మందులు, ఆందోళన (Anxiety), నిద్ర మందులు అనేక దేశాల్లో మాదక లేదా నియంత్రిత మెడిసిన్స్ గా పరిగణిస్తారు.
యూఏఈ ప్రిస్క్రిప్షన్ విదేశాల్లో చెల్లుతుందా?
యూఏఈలో జారీ చేసిన వైద్య ప్రిస్క్రిప్షన్లు చాలా దేశాల్లో గుర్తిస్తారని న్యాయ సలహాదారు అహ్మద్ అల్జరూనీ తెలిపారు. అయితే ప్రతి దేశానికి వేర్వేరు నిబంధనలు ఉండటంతో, ప్రయాణానికి ముందు ఆయా దేశాల్లోని మెడిసిన్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో వైద్యుడి ప్రిస్క్రిప్షన్, అవసరమైతే వైద్య నివేదికను ఇంగ్లిష్ లేదా వెళ్లే దేశ భాషలో అనువదించి వెంట తీసుకెళ్లడం మంచిదని చెప్పారు.
యూఏఈకి తిరిగి వచ్చే వారికీ నిబంధనలు
విదేశాల నుంచి నియంత్రిత మందులను యూఏఈకి తీసుకురావాలంటే ముందస్తు వ్యక్తిగత దిగుమతి అనుమతి (Personal Import Permit) తప్పనిసరి. ఈ సేవను 2025 డిసెంబర్ 29 నుంచి ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (Emirates Drug Establishment) నిర్వహిస్తోంది. ముందస్తు అనుమతి లేకుండా నియంత్రిత మందులతో వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలో రెడ్ కస్టమ్స్ ఛానెల్ ద్వారా వెళ్లి, తమ మందులను ప్రకటించడంతో పాటు వైద్య ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్టును అధికారులకు సమర్పించాలి. ప్రస్తుతం అధికారిక జాబితాలో 200కుపైగా నియంత్రిత మెడిసిన్స్ ఉండగా, వాటిలో కొన్ని అనుమతితో తీసుకురావచ్చు, మరికొన్ని పూర్తిగా నిషేధించారు.
తాజా వార్తలు
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...







