పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!

- July 21, 2026 , by Maagulf
పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!

మస్కట్:ఒమన్ విజన్ 2040 లక్ష్యాల సాధనలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణలో ఒమన్ విశేష పురోగతి సాధించింది. తాజా ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (Environmental Performance Index - EPI)లో ఒమన్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 180 దేశాల్లో 49వ ర్యాంక్ సాధించింది. 2024లో ఒమన్ 55వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 49వ స్థానానికి చేరుకుంది. మిడిలీస్ట్ దేశాల్లో ఒమన్ మూడో స్థానం, అరబ్ ప్రపంచంలో రెండో స్థానం, జీసీసీ (GCC) దేశాల్లో కూడా రెండో స్థానం దక్కించుకుంది.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (Sustainable Solid Waste Management),  గృహ వినియోగానికి స్వచ్ఛమైన ఇంధనం (Clean Household Fuel), సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు,  జీవ వైవిధ్య ప్రాంతాల సంరక్షణ (Species Habitat Protection), ఓపెన్-వాటర్ ట్రాలింగ్ నియంత్రణలో ప్రపంచంలోనే తొలి స్థానం సాధించింది. ఇక సముద్ర పర్యావరణ పరిరక్షణలో ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానం పొందింది.

ఒమన్ ప్రభుత్వం 2030 నాటికి ప్రపంచంలో తొలి 40 దేశాల్లో,2040 నాటికి తొలి 20 దేశాల్లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహజ వనరుల సంరక్షణ, పర్యావరణ నాణ్యత పెంపు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

2025లో దేశవ్యాప్తంగా 70 ఎయిర్ క్వాలిటీ పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే గాలిలో సహజంగా ఉండే దుమ్ము కణాలను, పరిశ్రమల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను వేర్వేరుగా గుర్తించే విధానాన్ని అమలు చేయడంలో ఒమన్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ చర్యల వల్లే సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపులో ప్రపంచంలో తొలి స్థానాన్ని సాధించింది.

ఒమన్‌లో సర్క్యులర్ ఎకానమీ (Circular Economy) అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి కేంద్రం రెండో దశ, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల గుర్తింపు, కొలతలు, వ్యర్థాల వర్గీకరణ కోసం రివర్స్ వెండింగ్ మెషీన్ ప్రాజెక్టుచ, రీసైకిల్ ప్లాస్టిక్ తయారీకి వ్యూహాత్మక పార్టనర్షిప్ వంటివి ఉన్నాయి. వీటితోపాటు రోజుకు సుమారు 3,000 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను విద్యుత్‌గా మార్చే వేస్ట్-టు-ఎనర్జీ ప్రాజెక్టు అమలులోకి రానుంది. దీని ద్వారా 75 నుంచి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ల్యాండ్‌ఫిల్‌లపై ఆధారపడటం గణనీయంగా తగ్గి, పునర్వినియోగం, పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

అదే విధంగా అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల సంరక్షణ కోసం ఒమన్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. వాటి పెంపకం, సహజ ఆవాసాల్లో తిరిగి విడిచిపెట్టడం, దేశవ్యాప్తంగా జీవజాతుల సంఖ్యను పర్యవేక్షించే జాతీయ ప్రాజెక్టును అమలు చేస్తోంది.

2050 నాటికి కార్బన్ న్యూట్రల్ దేశంగా మారాలనే లక్ష్యంతో ఒమన్ ముందుకు సాగుతోంది. అదే ఏడాదికి కార్బన్ ఉద్గారాలను 33 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ చట్టాల బలోపేతం, డిజిటల్ సేవల విస్తరణ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, వాతావరణ మార్పుల నియంత్రణ చర్యలు ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com