యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- November 03, 2026
దుబాయ్: యూఏఈలో వాహనాల యజమానులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా ఐదు వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే రెండు వాహనాల వరకు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మూడో వాహనం నుంచి ఐదో వాహనం వరకు ప్రతి అదనపు వాహనానికి ప్రత్యేక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇంటి సభ్యుల సంఖ్యతో సంబంధం లేదు
ఈ వాహనాల పరిమితి ఒక్కో నివాసితుడికి వర్తిస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారనే దానితో సంబంధం లేకుండా, ఒక్కొక్కరి పేరుపై గరిష్ఠంగా ఐదు వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెండు వాహనాల తర్వాత మూడో, నాలుగో, ఐదో వాహనాలకు అదనపు ఫీజు చెల్లించాలి. అయితే ఫీజు చెల్లించినంత మాత్రాన ఐదు వాహనాలకు మించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఉండదు. అయితే ఈ అదనపు ఫీజు ఎంత ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ఇప్పటికే ఐదుకు మించి వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి పరిస్థితి ఏమిటి? వారు వాహనాలను విక్రయించాలా లేదా ఇతరుల పేర్లకు బదిలీ చేయాలా? అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు.
ఇతర వాహన రిజిస్ట్రేషన్ నిబంధనలు
కొత్త నిబంధనల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ కోసం యజమానులు లేదా చట్టబద్ధంగా అధికారం పొందిన ప్రతినిధులు సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ ప్రకటించిన వెబ్‌సైట్లు, అప్లికేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు సూచించిన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే రైట్‌హ్యాండ్ డ్రైవ్ వాహనాలకు రిజిస్ట్రేషన్ అనుమతి ఉండదు. వాటిని కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. ట్రాఫిక్ భద్రతా ప్రమాణాలను పాటించని వాహనాలకు కూడా లైసెన్సింగ్ చేయరు.
గతంలోనూ చర్చించిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్
యూఏఈలో వాహనాల సంఖ్య పెరుగుతుండటం, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలోనూ వాహనాల యాజమాన్యంపై చర్చ జరిగింది. ఒక్కొక్కరు ఎన్ని వాహనాలు కలిగి ఉండాలనే దానిపై పరిమితులు విధించాలని, వాహనాల వినియోగ కాలంపైనా నియంత్రణలు తీసుకురావాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది.
గతంలో అమల్లో ఉన్న 1997 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 130 స్థానంలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో యూఏఈలో వ్యక్తిగత వాహనాల సంఖ్యను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!
- కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు







