ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..

- July 21, 2026 , by Maagulf
ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్–యూఏఈ మధ్య వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ దిశగా జరిగిన చర్చలకు కొనసాగింపుగా యూఏఈ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం మామిడి, అరటి, కోకోతో పాటు ఇతర ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా సమగ్ర వాల్యూ చైన్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా ఎగుమతులను పెంచడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధి మండలి (EDB) ఉన్నతాధికారులు, యూఏఈ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ప్రాసెసింగ్ రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు, రాష్ట్ర ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com