కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- July 28, 2026
కువైట్ సిటీ: కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు స్థానిక పౌరులకు ఉద్యోగ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కువైట్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్‌పవర్, పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఐక్యరాజ్యసమితి (యూఎన్) అనుబంధ సంస్థలు సంయుక్తంగా తొలి సమన్వయ సమావేశాన్ని నిర్వహించాయి.
ఈ సమావేశంలో కార్మికుల రక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధంపై పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సహాయ విదేశాంగ మంత్రి అంబాసడర్ షేకా జవాహేర్ ఇబ్రాహీం అల్-దువైజ్ అల్-సబాహ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు అంతర్జాతీయ బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేయాలనే కువైట్ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనమని తెలిపారు. ఐక్యరాజ్యసమితితో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కువైటీకరణ (Kuwaitization) నిబంధనలు అమలు చేయడంతో కువైట్ పౌరులకు ఉద్యోగ భద్రత పెరిగిందని మాన్‌పవర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాంట్రాక్టులు మారినప్పటికీ ఉద్యోగులను కొత్త కాంట్రాక్టులకు బదిలీ చేస్తూ, వారి వేతనాలు తగ్గకుండా లేదా మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
అలాగే, ప్రైవేట్ రంగంలో కువైట్ పౌరులు ఆకర్షణీయమైన ఉద్యోగాలను ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూపొందించిన "ఆవర్ ప్రైడ్" (Our Pride) వేదిక కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ చర్యలతో దేశ కార్మిక మార్కెట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







