భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- July 28, 2026
న్యూఢిల్లీ: భారత బొమ్మల (టాయ్స్) పరిశ్రమ అభివృద్ధి, దిగుమతుల నియంత్రణ, ఎగుమతుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
జూలై 4 నుంచి 7 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ బి2బి ఎగ్జిబిషన్ భారత బొమ్మల పరిశ్రమకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రోత్సాహాన్ని అందించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో 400 భారతీయ టాయ్ బ్రాండ్లు, 40 దేశాల నుంచి 100 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు, సుమారు 30 వేల మంది వ్యాపార సందర్శకులు పాల్గొన్నారని తెలిపారు. తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఈ-కామర్స్ సంస్థల మధ్య వ్యాపార అవకాశాలను ఈ ఎగ్జిబిషన్ విస్తరించిందని వివరించారు.
ప్రస్తుతం దేశానికి ప్రత్యేక టాయ్ పాలసీ లేకపోయినా, భారత బొమ్మల పరిశ్రమ అభివృద్ధి కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ (NAPT) అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 14 మంత్రిత్వ శాఖల సమన్వయంతో 21 కీలక కార్యాచరణ అంశాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
బొమ్మల పరిశ్రమను బలోపేతం చేసేందుకు బొమ్మలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 70 శాతానికి పెంచడం, నాణ్యత నియంత్రణ ఉత్తర్వులు (QCO) అమలు చేయడం, BIS ప్రమాణాల ప్రకారం దేశీయ తయారీదారులకు 1,800కు పైగా లైసెన్సులు జారీ చేయడం, టాయ్ క్లస్టర్ల అభివృద్ధి, స్టార్టప్ ఇండియా కింద 700కు పైగా టాయ్ స్టార్టప్‌లకు గుర్తింపు ఇవ్వడం, RoDTEP పథకం ద్వారా 2,200కు పైగా ఎగుమతిదారులకు మద్దతు అందించడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
అదేవిధంగా యూఏఈ, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA), యునైటెడ్ కింగ్‌డమ్ తదితర దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ద్వారా భారత బొమ్మలకు సుంక రహిత మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ చర్యల ఫలితంగా భారత బొమ్మల పరిశ్రమలో గణనీయమైన పురోగతి నమోదైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019లో BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బొమ్మలు కేవలం 33 శాతం మాత్రమే ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య 95 శాతానికి పెరిగిందని తెలిపింది.
అలాగే 2018-19తో పోలిస్తే 2025-26 నాటికి బొమ్మల దిగుమతులు 37.5 శాతం తగ్గగా, ఎగుమతులు 89.1 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం భారత్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాలకు బొమ్మలను ఎగుమతి చేస్తూ ప్రపంచ మార్కెట్‌లో నికర ఎగుమతిదారుగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!







