తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- July 28, 2026
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్లో కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో పేదలకు గృహ నిర్మాణం, గ్రామీణ ఉపాధి, రైతుల జీవనోపాధి మెరుగుదలపై పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. గత ప్రభుత్వం పీఎంఏవై-జీ పథకాన్ని సక్రమంగా వినియోగించుకోకపోవడంతో గత పదేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది పేదలు సొంత ఇళ్లు నిర్మించుకోలేకపోయారని, ప్రస్తుతం ఇళ్లకు భారీ డిమాండ్ నెలకొందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆవాస్ ప్లస్ (Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, వీరందరికీ వీలైనంత త్వరగా పీఎంఏవై-జీ కింద ఇళ్లను కేటాయించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) – VBGRAMG కింద అదనపు పనులను చేర్చాలని కోరారు. వర్షాభావంతో ఉపాధి కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు, పంటల వైవిధ్యీకరణకు అనుకూలమైన పనులను ఈ పథకంలో చేర్చాల్సిన అవసరం ఉందని వివరించారు.
రైతులు తమ భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల సమీపంలో ఆకుకూరలు, కూరగాయల తోటలు, వెదురు వనాల అభివృద్ధి వంటి పనులను వీబీగ్రామ్జీలో చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే కొండ ప్రాంతాలు, కొండ వాలుల్లో నీటి నిల్వ కందకాల నిర్మాణం, పండ్ల తోటల్లో తేమ సంరక్షణ పనులు, వరదలు, ఇసుక మేటలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణకు అవసరమైన పనులను కూడా ఈ పథకంలో చేర్చాలని కోరారు.
ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద గతంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సమయంలో 90 రోజుల వరకు ఉపాధి కల్పించే అవకాశం ఉండేదని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, అదే విధానాన్ని వీబీగ్రామ్జీలో కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇతర పనులను కూడా ఈ పథకంలో చేర్చాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్లు, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆహ్వానించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, కిరణ్ చామల, రామసహాయం రఘురాం రెడ్డి, కాక వెంకటస్వామి (వంశీ)తో పాటు ఎక్స్-అఫిషియో ప్రత్యేక కార్యదర్శి కె. రామకృష్ణారావు, సమన్వయ శాఖ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







