యూఏఈలో ఆగస్టులో ఇంధన ధరలు తగ్గుతాయా?
- July 30, 2026
దుబాయ్: యూఏఈలో వాహనదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు నెలలో పెట్రోల్ ధరలు వరుసగా రెండో నెల కూడా తగ్గే అవకాశమున్నప్పటికీ, తగ్గుదల మాత్రం స్వల్పంగానే ఉండొచ్చని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర రవాణా అంతరాయాలు, హోర్ముజ్ జలసంధి పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా చమురు మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది.
సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ విజయ్ వాలేచా మాట్లాడుతూ.. ముడి చమురు ధరలు తగ్గిన ప్రభావం యూఏఈలోని రిటైల్ ఇంధన ధరలపై కనిపిస్తుందని, అయితే అది పూర్తిస్థాయిలో లేదా వెంటనే ప్రతిబింబించకపోవచ్చని తెలిపారు. నిల్వలు తక్కువగా ఉండటం, మార్కెట్ పరిస్థితులు వంటి కారణాలతో పెట్రోల్ ధరల తగ్గుదల పరిమితంగానే ఉండే అవకాశం ఉందన్నారు.
జూలైలో బ్రెంట్ క్రూడ్ సగటు ధర బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద ఉంటే.. స్పెషల్ 95 ధర లీటరుకు దిర్హామ్ 3.13, సూపర్ 98 ధర దిర్హామ్ 3.24 వరకు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
గత మూడు నెలల్లో ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా యూఏఈలో ఇంధన ధరలు వరుసగా పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత జూలైలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సూపర్ 98 ధర లీటరుకు దిర్హామ్ 3.40, స్పెషల్ 95 ధర 3.29, ఈ-ప్లస్ ధర 3.21, డీజిల్ ధర 3.60 దిర్హామ్ గా ఉన్నాయి.
అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా సున్నితంగానే ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎలివేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు మధుర్ కక్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు మార్కెట్ డిమాండ్-సరఫరా కంటే అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికే ఎక్కువగా లోనవుతోందన్నారు. పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారితే బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సాక్సో బ్యాంక్ విశ్లేషకులు కూడా ఆగస్టులో చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. గల్ఫ్ ప్రాంత పరిస్థితులను బట్టి యూఏఈ ఇంధన ధరలు మారే అవకాశముందని, అందువల్ల ఆగస్టులో స్వల్ప తగ్గుదల కనిపించినా భారీగా ధరలు తగ్గుతాయని ఆశించవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







