దుబాయ్‌లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- August 09, 2026
దుబాయ్: యూఏఈలో నివసిస్తున్న నాన్ ముస్లిం ప్రవాసులు దేశంలోనే వివాహం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దుబాయ్‌లో నివసిస్తున్న ముస్లిమేతర జంటలు యూఏఈ ముస్లిమేతరుల వ్యక్తిగత చట్టాల (UAE Personal Laws for Non-Muslims) ప్రకారం సివిల్ మ్యారేజ్ చేసుకోవచ్చు. వివాహానికి సంబంధించిన నిబంధనలు, ప్రక్రియలను ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 41 ఆఫ్ 2022లో పొందుపరిచారు.
-ముస్లిమేతర జంటలు సివిల్ మ్యారేజ్ చేసుకోవాలంటే వధూవరులు ఇద్దరూ కనీసం 21 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. వివాహానికి తమ సమ్మతిని న్యాయమూర్తి ఎదుట స్పష్టంగా ప్రకటించాలి. అలాగే ఇద్దరూ డిస్క్లోజర్ ఫారాన్ని సంతకం చేయాల్సి ఉంటుంది. సంబంధిత పర్సనల్ స్టేటస్ కోర్టులో సర్టిఫికేషన్ జడ్జి ఎదుట దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి.
- వధూవరులు కోర్టు ముందు నిర్దేశిత ఫారాన్ని పూర్తి చేయాలి. వివాహ సమయంలో తమ హక్కులు, విడాకుల అనంతరం హక్కులకు సంబంధించి కొన్ని నిబంధనలను పరస్పర అంగీకారంతో ఒప్పందంలో పొందుపరచుకునే అవకాశం ఉంది. ఇందులో పిల్లల ఉమ్మడి కస్టడీ వంటి అంశాలను కూడా చేర్చవచ్చు.
- వివాహ ఒప్పందంలో గతంలో జరిగిన వివాహాల వివరాలు, అవసరమైతే విడాకుల తేదీలను వెల్లడించాలి. భార్య ప్రస్తుతం మరే వివాహ బంధంలోనూ లేనట్లు ప్రకటించాలి. తన దేశ చట్టాల ప్రకారం బహుభార్యత్వానికి అనుమతి లేని సందర్భంలో భర్త కూడా ఇదే తరహా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఏ సందర్భంలోనైనా భర్తకు ప్రస్తుతం ఉన్న ఇతర వివాహ బంధాల వివరాలను న్యాయమూర్తికి వెల్లడించాలి.
- వధూవరులిద్దరూ వివాహానికి తమ సమ్మతిని మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అన్ని నిబంధనలు, ప్రక్రియలు పూర్తయిన తర్వాత సర్టిఫికేషన్ జడ్జి వివాహ ఒప్పందాన్ని ధ్రువీకరిస్తారు. అనంతరం అది అధికారిక రిజిస్టర్లో నమోదు అవుతుంది.
మతపరమైన కేంద్రాల్లోనూ వివాహం
వివాహం చేసుకోబోయే జంటకు ఉన్న మతం ఆధారంగా దుబాయ్‌లోని సంబంధిత అనుమతి పొందిన ముస్లిమేతర మతపరమైన కేంద్రాల్లో కూడా వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు చర్చిలు, హిందూ దేవాలయాలు, సిక్కు గురుద్వారాల్లో వివాహ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. అయితే సంబంధిత కేంద్రం దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA) నుంచి అనుమతి పొందినదై ఉండాలి.
యూఏఈలోని తమ దేశ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ ద్వారా ముస్లిమేతరుల వివాహాలను నిర్వహించే సేవలను అందిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. అలాంటి సేవ అందుబాటులో ఉంటే సంబంధిత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
వివాహానికి అవసరమైన అదనపు పత్రాలు, తాజా విధానాలు జాతీయత, వివాహం చేసుకునే విధానం ఆధారంగా మారే అవకాశం ఉన్నందున.. సంబంధిత దుబాయ్ కోర్టు, అనుమతి పొందిన మతపరమైన కేంద్రం లేదా తమ దేశ రాయబార కార్యాలయం/కాన్సులేట్‌ను ముందుగా సంప్రదించడం మంచిది. అవసరమైతే యూఏఈలోని న్యాయ నిపుణుల సలహా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







