ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- August 11, 2026
దుబాయ్: వాహనదారులు ట్రాఫిక్ జరిమానాలను బాధ్యతాయుతంగా చెల్లించేలా ప్రోత్సహించడంతో పాటు, డిజిటల్ రోడ్డు భద్రతా సేవలను మరింతగా వినియోగించుకునేలా దుబాయ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జరిమానాలు పేరుకుపోకుండా చూసుకోవాలని, అందుబాటులో ఉన్న సులభమైన చెల్లింపు, వాయిదా సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజానికి చెందిన 70 మందికి పైగా ఉద్యోగుల కోసం ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. ట్రాఫిక్ జరిమానాలు, స్మార్ట్ సేవలు, రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన ప్రయాణంపై ఇందులో అవగాహన కల్పించారు.
జరిమానాలు పేరుకుపోకుండా జాగ్రత్త
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఇస్సామ్ ఇబ్రహీం అల్ అవార్ మాట్లాడుతూ.. సమాజంలోని వివిధ వర్గాల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ సేవలు, ట్రాఫిక్ విధానాలు, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల పాటింపు పెరుగుతుందని చెప్పారు. దీంతో ఉల్లంఘనలు తగ్గి రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని వివరించారు.
ట్రాఫిక్ జరిమానాలను నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం పేరుకుపోయేలా చేయడం వల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు చట్టపరమైన ప్రక్రియలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాయిదాల్లో జరిమానాల చెల్లింపు
వాహనదారులకు అందుబాటులో ఉన్న దుబాయ్ పోలీసుల స్మార్ట్ చెల్లింపు మార్గాలు, ట్రాఫిక్ జరిమానాలను వాయిదాల్లో చెల్లించే అవకాశాల గురించి వర్క్‌షాప్‌లో వివరించారు. ఈ సదుపాయాలు జరిమానాలను సులభంగా నిర్వహించుకోవడానికి వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పిస్తాయని తెలిపారు.
24 గంటలూ డిజిటల్ సేవలు
ట్రాఫిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ తలాల్ అబ్దుల్లా అల్ మన్సూరి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. రహదారులపై సాధారణంగా జరిగే ప్రమాదకర ప్రవర్తనలు, వాటి వల్ల ప్రజల భద్రతకు కలిగే ముప్పుపై ఆయన వివరించారు.
ట్రాఫిక్ జరిమానాలు చెల్లించేందుకు దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, అధికారిక వెబ్సైట్, సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లు, స్మార్ట్ పోలీస్ స్టేషన్లు (SPS) వంటి పలు డిజిటల్ మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సేవలను 24 గంటలూ సురక్షితంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
సైకిళ్లు, ఈ-స్కూటర్ల పై అవగాహన
సైకిళ్లు, ఈ-స్కూటర్ల వినియోగంపై కూడా వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించారు. నిర్ణీత మార్గాల్లోనే ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, తప్పనిసరి భద్రతా ప్రమాణాలను అనుసరించడం, తగిన రక్షణ పరికరాలు ధరించడం వంటి అంశాలను వివరించారు.
రైడర్ల భద్రతతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించాలని సూచించారు.
‘అమన్ రోడ్స్’ ద్వారా రోడ్డు భద్రత సమాచారం
దుబాయ్ పోలీసుల ‘అమన్ రోడ్స్’ ట్రాఫిక్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్ గురించి కూడా పాల్గొన్న వారికి వివరించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన తాజా సమాచారం, సూచనలు, అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలను ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన జ్ఞానం, సురక్షిత ప్రయాణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఉద్యోగులు ట్రాఫిక్ జరిమానాలు, స్మార్ట్ సేవలు, రోడ్డు భద్రతా ప్లాట్‌ఫామ్‌పై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పద్ధతులను పాటించాలని దుబాయ్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్‌లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







