నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- August 12, 2026
దోహా: నాన్-హైడ్రోకార్బన్ రంగాల్లో బలమైన వృద్ధి సాధించడం ద్వారా ఖతార్ ఆర్థిక వ్యవస్థ 2025లో స్థిరత్వాన్ని ప్రదర్శించింది. దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 2.9 శాతం వృద్ధి చెందగా.. నాన్-హైడ్రోకార్బన్ రంగాలు ఏకంగా 4.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) తన వార్షిక స్థూల ఆర్థిక సమీక్షలో వెల్లడించింది. ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా చేపట్టిన ఆర్థిక వైవిధ్యీకరణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని QCB తెలిపింది.
2025లో ఖతార్‌లో సగటు ద్రవ్యోల్బణం కేవలం 0.5 శాతంగా నమోదైంది. కొన్ని వినియోగ వస్తువుల ధరల్లో, ముఖ్యంగా ఆభరణాల విభాగంలో మాత్రమే స్వల్ప ధరల ఒత్తిడి కనిపించిందని QCB తెలిపింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా స్థిరంగా కొనసాగింది. ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు లేకపోవడంతోపాటు.. మార్కెట్లో అధిక వేడి లేదా ఊహాజనిత పెట్టుబడుల ప్రభావం కనిపించలేదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
ఖతార్ దేశీయ ప్రైవేట్ రంగం తన వృద్ధి పథాన్ని కొనసాగించింది. 2025లో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) సగటు 51.2 పాయింట్లుగా నమోదైంది. 50 పాయింట్లకు పైగా PMI నమోదవడం ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనడానికి సంకేతంగా QCB పేర్కొంది.
5.1 మిలియన్ల మంది పర్యాటకులు
ఖతార్ పర్యాటక రంగం కూడా 2025లో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. దేశాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య 5.1 మిలియన్లకు చేరింది. 2024లో 4.9 మిలియన్లు, 2023లో 4 మిలియన్ల మంది ఖతార్‌ను సందర్శించారు.
అంతర్జాతీయ ఆర్థిక రంగంలోనూ ఖతార్ బలమైన స్థితిని కొనసాగించింది. 2025లో దేశ కరెంట్ అకౌంట్ మిగులు QR116.2 బిలియన్లకు చేరింది. ఇది దేశ జీడీపీలో 14.8 శాతం కావడం విశేషం.
ఖతార్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ ఏడాదిలో 1.8 శాతం పెరిగింది. స్థానిక మూలధన మార్కెట్లను మరింత బలోపేతం చేసేందుకు సస్టైనబుల్, షరియా అనుగుణ ఆర్థిక సాధనాలను ప్రవేశపెట్టారు. ఖతార్‌లో తొలిసారిగా ESG ఆధారిత బాండ్, కార్పొరేట్ ఇస్లామిక్ సుకుక్ను కూడా జాబితా చేశారు.
బలమైన క్రెడిట్ రేటింగ్‌లు
ఖతార్ ఆర్థిక బలాన్ని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా గుర్తించాయి. S&P, Fitch సంస్థలు ఖతార్‌కు AA రేటింగ్‌ను, Moody’s Aa2 రేటింగ్‌ను కొనసాగించాయి. మూడు సంస్థలూ స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగించడం దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని QCB తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







