సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- August 13, 2026
రియాద్: విరాళాల సేకరణ కార్యక్రమాల్లో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు సౌదీ అరేబియా నాన్-ప్రాఫిట్ సెక్టార్ కోసం జాతీయ కేంద్రం కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత ఫండ్ రైజింగ్ గవర్నెన్స్ రూల్స్ (Fundraising Governance Rules)లో భాగంగా విరాళాల సేకరణ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల్లో పిల్లలను ఉపయోగించడాన్ని నిషేధించే నిబంధనను ప్రతిపాదించారు. ఈ ముసాయిదా నిబంధనలను ప్రజల అభిప్రాయాలు, సూచనల కోసం ఇస్తిత్లా (Istitlaa) పబ్లిక్ సర్వే ప్లాట్‌ఫామ్ లో అందుబాటులో ఉంచారు. ప్రజలు సెప్టెంబర్ 10 వరకు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం విరాళాలు సేకరించే సంస్థలు ప్రత్యేక లైసెన్స్ పొందాలి. ఇందుకోసం సంస్థకు ఆ కార్యకలాపాలను నిర్వహించేందుకు చట్టబద్ధమైన అనుమతి ఉండాలి. కనీస పాలనా ప్రమాణాలను పాటించడంతో పాటు, దరఖాస్తుకు ముందు ఏడాది కాలంలో తీవ్రమైన ఉల్లంఘనలు నమోదై ఉండకూడదు.అంతేకాకుండా సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందాలి. విరాళాల సేకరణ లక్ష్యాలు, ఖర్చులతో కూడిన సమగ్ర ప్రణాళికను కూడా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 18 ఆర్టికల్స్‌తో రూపొందించిన ముసాయిదాలో ప్రతి లైసెన్స్‌ను నిర్దిష్ట కార్యక్రమం లేదా లక్ష్యం కోసం మాత్రమే జారీ చేయాలని ప్రతిపాదించారు. లైసెన్స్ గడువు, వస్తు రూపంలోని విరాళాల సేకరణకు సంబంధించిన భౌగోళిక పరిధిని కూడా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
ప్రకటనల్లో QR కోడ్ తప్పనిసరి
విరాళాల కోసం చేసే ప్రకటనల్లో ‘Donate Safely’ సేవకు సంబంధించిన QR కోడ్ ఉండాలి. దీని ద్వారా దాతలు సంబంధిత సంస్థకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందా? ఆ లైసెన్స్ పరిధి ఎంత? అనే విషయాలను ధృవీకరించుకోవచ్చు. ప్రకటనల్లో తప్పుడు, అతిశయోక్తి లేదా తప్పుదారి పట్టించే సమాచారం ఉండకూడదు. ఖచ్చితమైన ప్రతిఫలం లభిస్తుందనే హామీలు ఇవ్వడం, మతపరమైన వచనాలను తప్పుగా అర్థం వచ్చేలా ఉపయోగించడం కూడా నిషేధించనున్నారు.అదేవిధంగా పిల్లలను ప్రకటనల్లో ఉపయోగించడం, దాతృత్వ కార్యక్రమాల ప్రతిష్ఠకు భంగం కలిగించే లేదా వివాదాలకు దారితీసే కంటెంట్‌ను ప్రచురించడం నిషేధించాలని ప్రతిపాదించారు.
విరాళాలు అందుకునే లబ్ధిదారుల గౌరవం, వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు కూడా నిబంధనలు ప్రతిపాదించారు. వారి మానవతా పరిస్థితులను దుర్వినియోగం చేసే విధంగా ఫొటోలు తీయడం లేదా ప్రదర్శించడంపై నిషేధం విధించారు. అలాగే వ్యక్తిగత ఫోన్ నంబర్లు వంటి సమాచారాన్ని ప్రచార సందేశాల కోసం ఉపయోగించే ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలి. వారు ఎప్పుడైనా ప్రచార సందేశాల నుంచి వైదొలిగే అవకాశం కల్పించాలి.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







