బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- August 16, 2026
మనామా: బహ్రెయిన్‌లో రెస్టారెంట్లలో విక్రయించే ఆహార పదార్థాల క్యాలరీల వివరాలను మెనూలో తప్పనిసరిగా వెల్లడించే విధానం తీసుకురావడంపై అధ్యయనం జరుగుతోంది. సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అహ్మద్ అల్ సల్లూమ్ స్వాగతించారు. ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు.. తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
డయబెటిక్, ఒబెసిటీ ఉన్నవారికి ప్రయోజనం
రెస్టారెంట్ ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో స్పష్టంగా తెలియజేస్తే డయబెటిక్, ఒబెసిటీ, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రయోజనం ఉంటుందని అల్ సల్లూమ్ తెలిపారు. అలాగే ప్రత్యేక డైట్ పాటించేవారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు కూడా తమకు అనుకూలమైన ఆహారాన్ని ఎంచుకోవచ్చన్నారు. ఆహార వివరాల్లో పారదర్శకత పెరగడం వల్ల ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇక క్యాలరీల వివరాలను వెల్లడించాల్సి వస్తే రెస్టారెంట్లు తమ పదార్థాలు, వంట విధానం, పరిమాణాలు, మెనూలను మరోసారి పరిశీలించాల్సి రావచ్చు. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను మెనూలో చేర్చేందుకు కూడా ఇది ప్రోత్సాహం కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆహారంపై పూర్తి వివరాలు అందించే రెస్టారెంట్లపై వినియోగదారుల్లో నమ్మకం పెరగడంతో పాటు.. మార్కెట్లో అవి ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం కూడా ఉందని అల్ సల్లూమ్ పేర్కొన్నారు.
రెస్టారెంట్లలో ప్రతి ఆహార పదార్థానికి సంబంధించిన క్యాలరీల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని తాను గతంలోనే ప్రతిపాదన సమర్పించినట్లు అల్ సల్లూమ్ తెలిపారు. వినియోగదారులు తాము కొనుగోలు చేసే ఆహారం యొక్క పోషక విలువ తెలుసుకునే హక్కు కలిగి ఉన్నారన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. క్యాలరీలను లెక్కించేందుకు గుర్తింపు పొందిన నిపుణ సంస్థలను నియమించి, వాటి ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ సంబంధిత విభాగాలు నిబంధనల అమలు, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టవచ్చన్నారు.
QR కోడ్లు, డిజిటల్ మెనూలతో సమాచారం
ఈ విధానంలో ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. డిజిటల్ మెనూలు, QR కోడ్లు, ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసే ముందే ఆహారంలోని క్యాలరీలు, పోషక విలువలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకునేలా వ్యవస్థను రూపొందించవచ్చని అల్ సల్లూమ్ తెలిపారు.
తాజా వార్తలు
- 30 ఏళ్లలోనే మెనోపాజ్‌కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్‌లో బైక్ రైడర్‌కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్‌న్యూస్.. ఖతార్ నుంచి భారత్‌కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!







