30 ఏళ్లలోనే మెనోపాజ్‌కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!

- August 16, 2026 , by Maagulf
30 ఏళ్లలోనే మెనోపాజ్‌కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!

షార్జా: మహిళలు మెనోపాజ్‌ దశకు 40 ఏళ్లలో సిద్ధమవడం కాకుండా, 30 ఏళ్ల మధ్య నుంచే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని యూఏఈ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌కు ముందు వచ్చే పెరిమెనోపాజ్‌ దశలో లక్షణాలను చాలామంది ఒత్తిడి, వయసు లేదా జీవనశైలిలో మార్పులుగా భావిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. పెరిమెనోపాజ్‌ సాధారణంగా 40 ఏళ్లలో ప్రారంభమైనప్పటికీ.. కొందరు మహిళల్లో 30 ఏళ్ల మధ్యలోనే మొదలయ్యే అవకాశం ఉందని Aster Clinic Qusaisలో స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుశ్రీ సరస్వతి తెలిపారు. నెలసరి క్రమంలో మార్పులు, మూడ్ స్వింగ్స్, నిద్ర సమస్యలు ప్రారంభ లక్షణాలుగా కనిపించవచ్చన్నారు. మహిళలు తమ నెలసరి మార్పులు, నిద్ర సమస్యలు, మూడ్ మార్పులు తదితర లక్షణాలను రికార్డు చేసుకుని, రెగ్యులర్ హెల్త్ చెకప్‌ల సమయంలో గైనకాలజిస్ట్‌తో చర్చించాలని సూచించారు.

30 ఏళ్లలోనే ఇలాంటి లక్షణాలు కనిపించడం అండాశయాల వృద్ధాప్యానికి ముందస్తు సంకేతం కావచ్చని RAK Hospitalలో కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డాక్టర్ మాల్గోర్జాటా సింక్లెయిర్ హెచ్చరించారు. ఈస్ట్రోజెన్ స్థాయిలు ముందుగానే తగ్గితే ఎముకల బలహీనత, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరగవచ్చని తెలిపారు. అందువల్ల లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. మెనోపాజ్‌ను ఎదుర్కొనేందుకు ముందుగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. 40 ఏళ్లలో మహిళలు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌, ప్రొటీన్‌, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలన్నారు. కాల్షియం, విటమిన్‌ D వంటి పోషకాలు కొందరికి అవసరం కావచ్చని తెలిపారు. అయితే మార్కెట్లో లభించే మెనోపాజ్‌ సప్లిమెంట్లను ఇష్టానుసారం తీసుకోవద్దని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ జాయిస్ హార్పర్ హెచ్చరించారు. అవసరాన్ని బట్టి మాత్రమే సప్లిమెంట్లు తీసుకోవాలని సూచించారు.

HRT విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి

హాట్ ఫ్లాషెస్‌, రాత్రిపూట చెమటలు, యోని పొడిబారడం వంటి మోస్తరు నుంచి తీవ్రమైన మెనోపాజ్‌ లక్షణాలకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) సమర్థవంతమైన చికిత్సల్లో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. అయితే HRT అందరికీ సరిపోదని, ఎప్పుడు ప్రారంభించాలి, ఎవరు తీసుకోవాలి అనే విషయాలను వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యులు నిర్ణయించాలని నిపుణులు స్పష్టం చేశారు.

మెనోపాజ్‌లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో నిద్రకు సంబంధించిన ఇబ్బందులు ఒకటని.. 110 మంది మెనోపాజ్‌ మహిళలపై నిర్వహించిన తాజా సర్వేలో 94.5 శాతం మంది నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడైందని వైద్యులు గుర్తుచేశారు. అలాగే 83 శాతం మంది హాట్ ఫ్లాషెస్‌ అనుభవించినట్లు సర్వే తెలిపిందన్నారు. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలో మార్పులు వస్తాయని, దీంతో అకస్మాత్తుగా వేడి అనిపించడం, రాత్రి నిద్రకు అంతరాయం కలగడం జరుగుతుందని నిపుణులు వివరించారు. మెనోపాజ్‌పై సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా విశ్వసనీయ వైద్య సంస్థల నుంచి సమాచారం పొందాలని నిపుణులు సూచించారు. మెనోపాజ్‌ అనేది వ్యాధి కాదని, మహిళల జీవితంలో సహజంగా వచ్చే దశ అయినప్పటికీ.. ముందుగానే అవగాహన కలిగి ఉండటం వల్ల లక్షణాలను సమర్థంగా నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com