మానసిక ఆరోగ్య చికిత్సలపై కఠిన నిబంధనలు అవసరం..!!
- August 18, 2026
కువైట్: సరైన అర్హతలు, క్లినికల్ శిక్షణ లేకుండానే థెరపిస్టులుగా చలామణి అవుతూ తీవ్రమైన మానసిక సమస్యలకు చికిత్స అందించే వారిని అడ్డుకోవాలని డాక్టర్ మరియం అల్ దైన్ సూచించారు. మానసిక ఆరోగ్య రంగంలో సేవలు అందించే వారి అర్హతలు, బాధ్యతలపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు రోగులను నిర్ధారించాలి, ఎవరు మానసిక పరిస్థితిని అంచనా వేయాలి, ఎవరు చికిత్స అందించాలి అనే అంశాల్లో స్పష్టమైన నిబంధనలు ఉండాలని ఆమె పేర్కొన్నారు. సైకాలజిస్టులు, థెరపిస్టులు, కౌన్సెలర్లు, కోచ్‌లు, అనుమతి లేని వ్యక్తుల మధ్య తేడాను ప్రజలు సులభంగా గుర్తించేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు. ఆందోళన, డిప్రెషన్, మానసిక గాయాలు వంటి సమస్యలకు చికిత్స అందిస్తామని ఎవరైనా ప్రకటిస్తే.. వారికి తగిన విద్యార్హతలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన చికిత్సా విధానాలు, క్లినికల్ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని డాక్టర్ మరియం అల్ దైన్ అన్నారు.
ఆన్‌లైన్ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నడపకూడదు
స్వల్పకాలిక కోర్సు లేదా ఆన్‌లైన్‌లో పొందిన సర్టిఫికెట్ ఆధారంగా క్లినిక్ ఏర్పాటు చేసి తీవ్రమైన మానసిక సమస్యలకు చికిత్స అందించడానికి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన డిగ్రీలు, పర్యవేక్షణలో క్లినికల్ శిక్షణ, ప్రతి విభాగానికి సంబంధించిన స్పష్టమైన విధులు, పరిమితులు ఉండాలని సూచించారు. చికిత్స సమయంలో ఏదైనా తప్పిదం జరిగితే బాధ్యతను నిర్ధారించేందుకు రోగి రికార్డులు, రోగి సమ్మతి, క్లినికల్ సూపర్‌విజన్, అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ నిబంధనలు, గోప్యత, మందులపై సలహా ఇచ్చే పరిమితులు వంటి అంశాలను కూడా నియంత్రణలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అయితే అన్ని నాన్-క్లినికల్ అర్హతలను ఒకే విధంగా చూడకూడదని ఆమె అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొన్ని కోర్సులు, అర్హతలు ఉన్నాయని, వాటిని కలిగి ఉన్న వ్యక్తులకు అన్యాయం చేయకూడదని స్పష్టం చేశారు.
రేకీ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలపై కూడా గతంలో డాక్టర్ మరియం అల్ దైన్ ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన వైద్య లేదా మానసిక చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఇలాంటి పద్ధతులను ప్రచారం చేయడం ద్వారా రోగుల్లో తప్పుడు ఆశలు కలిగే ప్రమాదం ఉందన్నారు.సోషల్ మీడియాలో రత్నాలు, ఉంగరాలకు ‘ప్రత్యేక శక్తులు’, ‘వైబ్రేషన్స్’ ఉన్నాయని ప్రచారం చేసే ప్రకటనలపైనా ఆమె విమర్శలు చేశారు. కొన్ని రాళ్లు లేదా ఉంగరాలు సంపద, అదృష్టం, సంతానం, ఆరోగ్యం, మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయని కొందరు చేస్తున్న ప్రచారాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె అభిప్రాయపడ్డారు. మరికొందరు ఏకంగా కొన్ని రాళ్లు, ఉంగరాల్లో జిన్నులు లేదా అదృశ్య శక్తులు ఉంటాయని ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







