సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు

- August 22, 2026 , by Maagulf
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు

సైబరాబాద్: ప్రజలకు మరింత చేరువ కావాలంటే పోలీసు వ్యవస్థకు ప్రజలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం.ఈ ఆలోచనతో 2006 ఆగస్టు 23న సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో ప్రజా భద్రతకు సంబంధించి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టింది.

మహిళల భద్రత కోసం ‘షీ షటిల్స్‌’, విద్యార్థుల భవిష్యత్తు, చదువుల కోసం ‘చైతన్య’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసింది.

నేను సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సెక్యూరిటీ కౌన్సిల్ కొంతవరకు నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉండేది. దానికి తిరిగి జీవం పోసి, ప్రజా భద్రతలో మరింత సమర్థవంతమైన భాగస్వామిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో పబ్లిక్–ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి, అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసులతో కలిసి నిరంతరం పనిచేసేలా సెక్యూరిటీ కౌన్సిల్‌ను బలోపేతం చేశాం.

నేడు  సైబరాబాద్ లో సెక్యూరిటీ కౌన్సిల్ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా భద్రతలో పోలీసుల పాత్రను మరింత విస్తరించడంలో కీలక భాగస్వామిగా నిలవడం సంతోషకరం.

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులకు, భాగస్వామ్య సంస్థలకు, గతంలో దీనితో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా, మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ప్రజా భద్రతకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com